గాల్లో దీపాలు ఆ గ్యారెంటీలు

` కాంగ్రెస్‌పై మంత్రి కేటీఆర్‌ ధ్వజం
` కాంగ్రెస్‌ను నమ్మితే అంతే సంగతులు
` సత్తుపల్లికి నర్సింగ్‌, పాలిటెక్నిక్‌ కాలేజీ..
ఖమ్మం(జనంసాక్షి): కాంగ్రెస్‌ పార్టీ చెబుతున్న ఆ ఆరు గ్యారెంటీలు ఆరిపోయే దీపాలు అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ధ్వజమెత్తారు. మొండిచేయికి ఓటేస్తే 3 గంటకల కరెంట్‌ గ్యారెంటీ, సంవత్సరానికి ఒక ముఖ్యమంత్రి దిగడం ఖాయం, ఆకాశం నుంచి పాతాళం వరకు అన్ని కుంభకోణాలే. ఆ కుంభకోణాల కాంగ్రెస్‌కు అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని దోచుకోవడం ఖాయం అని కేటీఆర్‌ అన్నారు. రూ. 50 కోట్లకు పీసీసీ అధ్యక్ష పదవి కొన్నాడని కాంగ్రెస్‌ నాయకులే అంటున్నారు. కోట్ల రూపాయాలకు ఎమ్మెల్యే సీట్లు అమ్ముకుంటున్నారని కాంగ్రెస్‌ నాయకులు ఆరోపిస్తున్నారు. వీళ్లకు ఓటేస్తే రాష్ట్రాన్ని అమ్ముకుంటాడు. ప్రజలు కాంగ్రెస్‌ గ్యారెంటీలను నమ్మరు. ఆగం కావొద్దు.. అభివృద్ధిలో భాగం కావాలి అని ప్రజలకు కేటీఆర్‌ పిలుపునిచ్చారు.సత్తుపల్లి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్‌ఎస్‌ బహిరంగ సభలో మంత్రి కేటీఆర్‌ పాల్గొని ప్రసంగించారు. ఈ జనాన్ని చూస్తుంటే వీరయ్య గెలుపు ఖాయమనే పరిస్థితి కనబడుతుంది. సత్తుపల్లి చైతన్యవంతమైన ప్రాంతం. రాజకీయాల్లో పార్టీలు మారడం సహజం. నిన్నటి దాకా కేసీఆర్‌ దేవుడు అని పొగిడినవారే.. ఇవాళ దుర్మార్గుడు అని పేర్కొనడం ఎంత వరకు సబబు..? చైతన్యంతో ఆలోచించిండి. కాంగ్రెస్‌ పార్టీ నాయకులు మాట్లాడుతూ.. కేసీఆర్‌ 2 వేల పెన్షన్‌ ఇస్తే.. డబుల్‌ ఇస్తామని అంటున్నారు. 24 గంటల కరెంట్‌ ఇస్తే 48 గంటల కరెంట్‌ ఇస్తామని అంటున్నారు. గ్యారెంటీ గ్యారెంటీ అని ఊదరగొడుతూ కొత్త కొత్త డైలాగులు చెబుతున్నారు. 150 ఏండ్ల కింద పుట్టిన పార్టీ.. ఆ పార్టీ వారెంటీ ఎప్పుడో అయిపోయింది. చచ్చిన పీనుగలాంటి పార్టీ. ఆ పార్టీకే వారెంటీ లేదు.. మరి ఆ పార్టీ నాయకుల మాటలకు గ్యారెంటీ ఉందా? ఆలోచించండి. ఆ నాయకుల మాటలకు విలువలేదు. హైదరాబాద్‌లో కమాండ్‌, బెంగళూరులో న్యూకమాండ్‌, ఢల్లీిలో హైకమాండ్‌ ఉంది. ఒకటి మాట ఒకరు వినరు. హావిూలకు పొంతన ఉండదు. కాంగ్రెస్‌ పార్టీ జాతీయ పార్టీ, మహాసముద్రం లాంటి పార్టీని చెబుతారు. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో రైతుబంధు, ఆసరా పెన్షన్లు అమలు చేస్తున్నారా? ఎందుకు తెలంగాణ విూద ప్రేమ పొంగిపొర్లుతోంది. 200 పెన్షన్లు ఇచ్చినోడు.. ఇప్పుడు 4 వేలు ఇస్తామంటే నమ్ముదామా? అని కేటీఆర్‌ ప్రశ్నించారు.150 ఏండ్ల ముసలి నక్క కాంగ్రెస్‌ అని కేటీఆర్‌ విమర్శించారు. కాంగ్రెస్‌ను నమ్మితే కుక్క తోకపట్టి గోదారి ఈదినట్టే. ఆలోచించండి ఒక్కసారి. ఆగం కావొద్దు. ఎన్నికలు అనగానే నాయకులు వస్తారు. కండువాలు మారుతాయి. ఊదరగొట్టే ఉపన్యాసాలు చేస్తారు. ఆరు దశాబ్దాలు పట్టించుకోనోళ్లు.. ఆరు గ్యారెంటీలు అంటే నమ్ముదామా? ప్రభుత్వంలో ఉన్నప్పుడు, కరెంట్‌, సాగు, తాగునీరు ఇవ్వరు. 75 ఏండ్ల స్వాతంత్య్ర అనంతరం, ఏ ప్రధాని, ఏ సీఎం చేయని విధంగా రైతుల ఖాతాల్లో రైతుబంధు జమ చేస్తున్నారు. 75 లక్షల ఖాతాల్లో రూ. 73 వేల కోట్లు జమ చేశారు సీఎం. రూ. 43 వేల కోట్లతో ఇంటింటికి నల్లా నీళ్లు అందిస్తున్నారు కేసీఆర్‌.విూరు అభివృద్ధి చేసి ఉంటే మాకు ఎందుకు అధికారం ఇస్తారు. రెండు టర్మ్‌ల్లో చాలా పనులు చేశాం. కాంగ్రెస్‌ చేయని పనులను కేసీఆర్‌ చేసి చూపించారు. ఇల్లు కట్టించి, పెళ్లి చేస్తున్నారు కేసీఆర్‌. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలను అమలు చేసి, పేదింటి ఆడబిడ్డలకు మేనమామగా మారారు. నేను రానో బిడ్డ సర్కార్‌ దవఖానాకు అని ప్రభుత్వ ఆస్పత్రులపై కవులు పాటలు రాశారు. కేసీఆర్‌ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందని కుటుంబం లేనే లేదు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీలు పెరిగాయి. మాతా శిశు మరణాలు తగ్గాయి. కేసీఆర్‌ కిట్‌ అమలు చేస్తున్నాం. ఇవన్నీ మన కళ్లెదుట కనబడటం లేదా..? అని కేటీఆర్‌ నిలదీశారు.నర్సింగ్‌ కాలేజీ, పాలిటెక్నిక్‌ కాలేజీ ఇవ్వబోతున్నామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. వ్యవసాయ ఆధారిత నియోజకవర్గం ఇది. చైతన్యవంతమైన రైతులు ఉన్నారు. సీతారామ ప్రాజెక్టు 90 శాతం పూర్తయింది. మిగతా 10 శాతం త్వరలోనే పూర్తి కానుంది. రాబోయే సంవత్సర కాలంలో 2 లక్షల ఎకరాలకు సాగునీళ్లు రాబోతున్నాయి. మళ్లీ వచ్చేది కేసీఆర్‌ ప్రభుత్వమే. కచ్చితంగా గోదావరి జలాలు తీసుకొచ్చి ఏడున్నర లక్షలకు నీళ్లు ఇవ్వబోతున్నాం. రైతుబంధులెవరో.. రాబంధులెవరో ఆలోచించండి.సీతారామం పూర్తయితే మూడు పంటలకు నీళ్లు తప్పకుండా వస్తాయి. సత్తుపల్లి నియోజకవర్గంలో ప్రతి దళితకుటుంబానికి దళితబంధు అమలు చేస్తాం. మధిర నియోజకవర్గంలోని బోనకల్లు మండలంలో కూడా ప్రతి దళిత కుటుంబానికి ఇస్తాం. ఈ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని అధికారులను సీఎం కేసీఆర్‌ ఆదేశించారని కేటీఆర్‌ గుర్తు చేశారు.