గిట్టుబాటు ధరకు కృషి : మంత్రి సుదర్శన్‌రెడ్డి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 26 : రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని మంత్రి సుదర్శన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుందన్నారు. మండలంలోని ఎఆర్‌పి క్యాంప్‌లో శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలను రైతులు వినియోగించుకోవాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో గిట్టుబాటు ధరలభించడం లేదని రైతులు మంత్రి దృష్టికి తేగా ఆయన పై విధంగా స్పందింఛారు. బిపిటి ధాన్యానికి 1500, దొడ్డు రకం దాన్యానికి 1280 ఇచ్చేలా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామని మంత్రి తెలిపారు. ఎన్‌డిఎస్‌ఎల్‌ క్వార్ట్‌ర్స్‌లలో పుట్టిన వారికి హక్కు పత్రాలు అందజేయాలని పలువురు మంత్రిని కోరారు. దీనికి స్పందించిన ఆయన ఉద్యోగి ఖాలీద్‌ అలీతో అక్కడి నుంచే ఫోన్‌లో మంత్రి మాట్లాడారు. గతంలో పలువురికి గుంట భూమి ఇవ్వగా వాటిని రిజిస్ట్రేషన్‌ చేసి ఇవ్వాలని లబ్దిదారులు కోరారు. ప్రాణహిత చేవేళ్ల నీటిని బోధన్‌లోని బెల్లాల్‌ ప్రాంతానికి తాగేందుకు సరఫరా చేయిస్తామన్నారు. నిజామాబాద్‌ నగర పాలక సంస్థతో పాటు బోధన్‌ మున్సిపాలిటీకి ఈ ప్రాజెక్టు ద్వారా తాగునీటిని అందిస్తామన్నారు. అంతకు ముందు గ్రామానికి చెందిన కాంగ్రెస్‌ నాయకుడు బలరాం కుటుంబాన్ని మంత్రి పరామర్శించారు. బలరాం తండ్రి ఇటీవల మృతి చెందారు. మంత్రి వెంట మాజీ జడ్పీ వైస్‌చైర్మన్‌ తాహెర్‌బిన్‌ హందాన్‌, మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఎల్లయ్యయాదవ్‌, బోధన్‌ మార్కెట్‌ కమిటీ ఉపాధ్యక్షుడు మల్కారెడ్డి, డిసిసి కార్యదర్శి విజయగౌడ్‌, మాజీ ఎంపిటిసి ఆకుల శ్రీనివాస్‌, తోట రాజశేఖర్‌ తదితరులు ఉన్నారు.