గ్రామ సమస్యలపై అధ్యయనం

అందుకు అనుగుణంగా పరిష్కారం

ఆదిలాబాద్‌,నవంబర్‌2(జ‌నంసాక్షి): జిల్లాను అన్నిరంగాల్లో అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో కలెక్టర్‌ జ్యోతిబుద్ధప్రకాశ్‌ చేపట్టిన గ్రామదర్శిని కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తోంది. ప్రధానంగా సమాచార సేకరణకు తోడ్పడుతోంది. గ్రామాల్లో సమస్యలతో పాటు పనులకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలు కలుగుతోంది. జిల్లాలోని 18మండలాలకు ఒక్కో జిల్లాస్థాయి అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించి, ఆ అధికారి సారథ్యంలో మండలస్థాయి అధికారుల బృందం ప్రతివారం ఒక పంచాయతీని సందర్శించడం ద్వారా ప్రజల్లో కూడా భరోసా కలుగుతోంది. ఆయా కార్యక్రమాలపైనా ప్రజలను చైతన్య పర్చనుంది. యువతకు దిశానిర్దేశం చేస్తూ వారిలో నైపుణ్యాభివృద్ధి పెంపునకు, మహిళాసాధికారితకు అవసరమైన చర్యలు తీసుకోనుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న హరితహారంతో పాటు ఉపాధి హావిూ, మరుగుదొడ్ల నిర్మాణం, తాగునీటి సౌకర్యం, పారిశుద్ధ్యం, ఆసరా పింఛన్లు, ఆరోగ్యం, విద్య, అంగన్‌వాడీ, వసతిగృహాలు, పాఠశాలలు, వయోజన విద్య, రేషన్‌ సరకుల పంపిణీ, వ్యవసాయం వంటి ప్రభుత్వ కార్యక్రమాల అమలును పర్యవేక్షిస్తారు. గ్రామంలో జరిగే అసాంఘిక కార్యక్రమాలపై ఆరా తీసి నివారణకు చర్యలు తీసుకుంటారు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా అవసరమైన యూనిట్ల మంజూరుకు అర్హులను గుర్తిస్తారు. బెల్టుదుకాణాలు, గుడుంబా విక్రయాలు, జూదం, మట్కా వంటి వాటిపై నిఘా పెట్టి అసాంఘిక కార్యకలాపాలకు ‘చెక్‌’ పెట్టనుంది.గ్రామదర్శిని పేరిట గ్రామాలను సందర్శించనున్న అధికార బృందం తాము పర్యటించే గ్రామంలో ప్రధానంగా ఆయా అంశాలపై దృష్టిసారించనుంది. ఈ బృందంలో జిల్లాస్థాయి అధికారితో పాటు స్థానిక అధికారులు కూడా ఉంటారు. వీరంతా ఉదయమే ఎంపిక చేసిన గ్రామానికి బయల్దేరి వెళ్తారు. ఇందులో భాగంగా ఉపాధ్యాయులు సమయానికి పాఠశాలకు వెళ్లడం లేదా అన్నది కూడా ఆరా తీస్తున్నారు. ఇతరశాఖల ఉద్యోగులూ పనిచేస్తున్న చోట ప్రజలకు అందుబాటులో ఉండటం లేదా అననది కూడా తెలుసుకుంటారు. అక్కడ అమలవుతున్న ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల తీరుతెన్నులను పర్యవేక్షిస్తున్నారు. ఆయా గ్రామాలకు వెళ్లిన అధికార యంత్రాంగం తొలుత ప్రభుత్వ సంస్థలైన గ్రామ పంచాయతీ మొదలుకొని పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు పరిశీలిస్తారు.