గ్రూప్‌-2కు సర్వం సిద్ధం : వాణీమోహన్‌

ఏలూరు, జూలై 19 : రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఎపిపిఎస్‌సి గ్రూప్‌-2 పరీక్షలను ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా ఏ ఒక్క తప్పుకు తావులేకుండా పకడ్బందీగా నిర్వహించాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్‌ జి. వాణీమోహన్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లో గురువారం ఎపిపిఎస్‌సి గ్రూప్‌ – 2 పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై చీఫ్‌ సూపరింటెండెంట్లు, సమన్వయ అధికారులు, సహాయ సమన్వయ అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టరు పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో 5లక్షల మంది ఈ పరీక్షలకు హాజరవుతున్నారని, అత్యంత ప్రాధాన్యతనిచ్చి పరీక్షలు నిర్వహించాలన్నారు. జిల్లాలో 17,300 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరవుతున్నారని, ఇందుకోసం ఏలూరులో 50 సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పరీక్షల నిర్వాహణకు 14 రూట్‌లుగా విభజించడం జరిగిందని, 14 మంది లైజన్‌ అధికారులుగా తహశిల్దార్లను నియమించడం జరిగిందన్నారు. 50 మంది డిప్యూటీ తహసిల్ధార్లను అసిస్టెంట్‌ లైజన్‌ అధికారులుగా, ఛీఫ్‌ సూపరింటెండెంట్లుగా 50 మందిని నియమించడం జరిగిందన్నారు. పరీక్షలు నిర్వహించే ప్రాంతాల్లో ఆయ తేదీల్లో 144 సెక్షన్‌ విధించడం జరిగిందని, ఏలూరు ఆర్‌ డిఓ, తహశిల్దారు, పోలీస్‌లు వీటిని పర్యవేక్షించాలని సూచిస్తూ నగరంలోని జిరాక్స్‌ సెంటర్లు కూడా పరీక్షా తేదీలలో మూసివేయించి ఉంచాలన్నారు. అలాగే పరీక్షకు సంబంధించిన పరీక్షా మెటిరీయల్‌ను పరీక్షాకేంద్రాలకు తరలించేందుకు ఎస్కార్ట్‌ అధికారులను, సెంటర్‌ల వద్ద పూర్తి భద్రతను ఏర్పాట్లు చేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. పరీక్షా తేదీల్లో ఆయారూట్లలో తగినన్ని బస్సులను వేయాలని ఆర్‌ టిసి ఆర్‌ ఎంకు సూచించారు. అభ్యర్థులకు పరీక్షాసమయంలో ఇబ్బంది ఎదుర్కొనకుండా నిరంతర విద్యుత్‌ సరఫరాకు ఏర్పాట్లు చేయాలని ట్రాన్స్‌కో అధికారులను ఆదేశించారు. మున్సిపల్‌ అధికారులు ప్రైవేట్‌ పాఠశాల యాజమాన్యాలను సంప్రదించి, మంచినీరు, పారిశుధ్యం, మరుగుదొడ్ల సౌకర్యం కల్పనకు చర్యలు చెపట్టాలన్నారు. సెంటర్‌కోడ్‌, పేపర్‌ పేరు, పేపర్‌ కోడ్‌లను పరీక్షా కేంద్రాలలో బోర్డుల మీద ప్రదర్శించాలన్నారు.