చమన్‌కు స్వాగత ఏర్పాట్లలో అభిమానులు బిజీ

అనంతపురం, జూలై 27 : పరిటాల రవి అనుచరుడు చమన్‌కు స్వాగతం పలికేందుకు ఆయన అభిమానులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయన శనివారం జిల్లాకు రానున్న విషయం తెలిసిందే. టీడీపీ పార్టీ శ్రేణులు బాహాటంగా ఏర్పాట్లలో పాల్గొనకపోయినప్పటికీ, అంతర్గతంగా సహాయ సహకారాలు అందిస్తున్నారన్న వార్తలు స్థానికంగా వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ధర్మవరం, పెనుకొండ, రాప్తాడు నియోజకవర్గాల ప్రజలు ఏర్పాట్లను చేస్తున్నారు. జిల్లాలోకి అడుగిడగానే తొలుత తన రాజకీయ గురువు పరిటాల రవీంద్ర ఘాట్‌ను సందర్శించనున్నారు. ఇదిలా ఉండగా చమన్‌ రాజకీయ చరిత్రను ఒకసారి పరిశీలిద్దాం.. పరిటాల రవీంద్ర నక్సల్స్‌ ఉద్యమంలో పనిచేస్తున్న సమయంలోనే ఆయనతో చమస్‌కు సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. ఉద్యమం నుంచి పరిటాల రవి జనబాహుళ్యంలోకి రావడం… ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందిన అనంతరం చమస్‌ పరిటాల రవికి కుడి భుజంగా కొనసాగారు. రామగిరి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన చమస్‌ పరిటాల ఆశీస్సులతో ఆ మండల టిడిపి కన్వీసర్‌గా పనిచేశారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకుంది. అప్పటికే పరిటాల, ఆయన ముఖ్య అనుచరులపై ప్రత్యర్థులు ప్రతీకారం తీర్పుకునేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో పరిటాల సూచన మేరకు 2004 జూన్‌లో చమన్‌ అజ్ఞాతంలోకి వెళ్లారనే ప్రచారం జరిగింది. చమస్‌ కోసం ఒకవైపు పోలీసులు, మరోవైపు ప్రత్యర్థులు తీవ్ర స్థాయిలో గాలించారు. అయినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. తాజాగా ఇటీవలే ఆయన డిజిపి ఎదుట లొంగిపోయిన విషయం తెలిసిందే. చమస్‌పై ఉన్న కేసులన్నీ కొట్టివేయడంతో జిల్లాకు రావడానికి మార్గం సుగమమైంది. ఆయన తెలుగుదేశం పార్టీలోనే కొనసాగే అవకాశాలు ఉన్నాయి.