చెరువులతో తెలంగాణ జన జీవన శైలి

ఉమ్మడి రాష్ట్రంలో ఆయా రాజవంశాల పాలనలో తెలంగాణకు వారసత్వంగా వచ్చిన మౌలిక వ్యవస్థలలో గొలుసుకట్టు చెరువులొకటి. కానీ ఈ 60 ఏళ్ల కాలంలో అవి అవసాన దశకు చేరుకున్నాయి. తెలంగాణ ఊర్లకు ప్రాథమిక నీటి వసతిలో భాగమైన చెరువుల వ్యవస్థను పునరుధ్దరించడమనే కర్తవ్యం ఒక చారిత్రిక అవసరంగా ముందుకొచ్చిన విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు గుర్తించి మిషన్‌ కాకతీయ పేరు తో గొలుసుకట్టు చెరువుల వ్యవస్థ పునరుద్ధరణ జరిగినది

ప్రకృతికి, జీవరాశికి ఏమాత్రం నష్టం చేయకుండా నిర్మాణ మైన చెరువులు ప్రాచీన సాంకేతిక నిపుణతకు నిదర్శనం. ప్రకృతి,జీవరాశికి మధ్య గొప్ప సమన్వయానికి నిదర్శనం ఈ వ్యవస్థ. ప్రాచీన కాలం నుంచి స్థానిక ప్రజల సాగునీరు,తాగునీరు అవసరాలను తీర్చిన గొలుసుకట్టు చెరువులు 1956 నుంచి తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయి.వీటిపై ఏమాత్రం అవగాహన లేనివారు అధికారంలోకి రావడంతో ఉమ్మడి రాష్ట్రంలో వాటి మనుగడపై వేటు పడింది.అంతకు మునుపు గ్రామపాలకుల అజమాయిషీలో చెరువుల నిర్వాహణ కొనసాగింది. ఏ సమస్య తలెత్తినా ఏ ఊరుకు ఆఊరి పాలక వర్గం వాటిని పరిష్కరించేది.ఆంధ్ర ప్రదేశ్‌ ఏర్పడిన తర్వాత కూడా తెలంగాణ ప్రాంతం 1970 వరకు అత్యధిక రెవిన్యూతో సంపన్నంగా ఉండడం దీనినే రూఢి చేస్తున్నది. చెరువు ఆధారిత వ్యవసాయమే అయినప్పటికీ 1970ల వరకు ఆనాటి ఏపి ఆదాయంలో తెలంగాణదే సింహభాగం. కానీ పంచాయితీ రాజ్‌ వ్యవస్థ అమలుతో వాటిపై అజమాయిషీ క్రమంగా నీటిపారుదల శాఖకు దఖలు పడింది. ఇందుకు మొదటి అడుగుగా వారు నిజాం కాలంలో ఏర్పాటైన చెరువులు, బావుల శాఖను రద్దు చేసి చిన్ననీటి పారుదల శాఖలో కలిపేశారు. ఈ పేరు మార్పిడితోనే తెలంగాణ చెరువులు ప్రాధాన్యతను కోల్పోయాయి.

చిన్ననీటి పారుదల శాఖలో చేర్చినా వాటి బాగోగులకు ఆనాటి ప్రభుత్వాలు నిధులు కేటాయించిన పాపాన పోలేదు. కాలువల వ్యవసాయమే తప్ప చెరువుల వ్యవసాయంపై అవగాహన, వాటిపై కోట్లాదిమంది ప్రజలు, జీవరాశి, జంతు జాలం మనుగడ సాగిస్తున్నాయన్న విషయం వారికి ఎరుక లేక పోవడం కారణం. తెలంగాణలో చెరువులు, కుంటలు నిండితే కృష్ణా, గోదావరి నదులలో నీటి శాతం తగ్గి తమ వ్యవసాయరంగానికి నష్టం వాటిల్లనున్నదన్న అలిఖిత అవగాహనతో స్థానిక చెరువులు, కుంటలను ప్రథకం ప్రకారం నిర్లక్ష్యం చేయడం మొదలు పెట్టారు. 1956-70 వరకు సాగిన ఈ తతంగంతో తెలంగాణ వ్యవసాయ రంగం సంక్షోభానికి భీజాలు పడ్డాయి.

చెరువుల నిర్వహణలో నీరటీకారులు, నిపుణులు. కాకతీయుల కాలంనుంచి వస్తున్న ఈ వ్యవస్థను 1983లో అధికారంలోకి వచ్చిన తెలుగు దేశం ప్రాంతీయ పార్టీ ప్రభుత్వం సరైన ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయకుండా, ఎటువంటి ముందు చూపు లేకుండా రద్దు చేయడంతో చెరువుల నిర్వహణ మొత్తం చిన్నాభిన్నమై పోయింది.ఇంతేకాకుండా చెరువులపై స్థానికంగా అజమాయిషీ లేకపోవడం, స్థానిక పంచాయితీలకు వాటి నిర్వహణ అధికారాలు లేక పోవడంతో గ్రామాలలో అనేక సమస్యలు తలెత్తాయి. తామంటే తామంటూ రైతులు చెరువునీళ్ల పారకానికి పోటీకి దిగడంతో ఊర్లలో ఘర్షణలు జరిగాయి. ఒకరి కొకరు పడక ఈర్ష్యా అసూయ ద్వేషాల వల్ల చెరువులకు గండ్లు పెట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.సమీప గుట్టలనుంచి వాననీటిని మోసుకు వచ్చే వాగులు కూడా ఆక్రమణలకు గురయ్యాయి. చెరువులు నిండడానికి ప్రతి గ్రామానికి అక్కడ పరిస్థితులననుసరించి ఒక శాస్త్రీయమైన వ్యవస్థ ఉండేది.

ప్రస్తుతానికి అదంతా ఛిన్నా భిన్నమైపోయింది. మరోవైపు వర్షాకాలంలో చెరువులు, కుంటలు గండ్లు పడి నీళ్లన్నీ వాగుల ద్వారా కృష్ణా, గోదావరి నదులకు చేరిపోతున్నాయి. దీనివల్లే తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలో కరువు, సంక్షోభం పెరగడానికి దారితీసింది. భూ గర్భజలాలు బాగా తగ్గిపోయి రైతులు మరింత ఖాయిలా పడిపోయారు. గొప్ప జీవనరీతికి పేరెన్నికగన్న గ్రామీణ ప్రాంతాలు హింసాప్రవృత్తికి, సామాజిక సంక్షోభానికి, కరువులకు, వలసలకు నిలయంగా మారిపోయాయి. నీటికరువుతో పశుసంపద తగ్గిపోయింది.అనేక శాసనాలకు, పాటలకు, పండుగలకు, సామెతలకు కేంద్రమైన తెలంగాణ చెరువులు తరతరాలుగా స్థానిక జీవనరీతికి నిట్టాడుగా ఉంటూ వచ్చినవి. చెరువు తవ్వించడం,దాని సమీపాన ఒక గుడిని నిర్మించడం ప్రతి రాజవంశానికి రివాజు.పురాణాలు నిర్దేశించిన సప్తవిధులలో భాగంగా పరిగణించడంతో వీటి నిర్మాణానికి ప్రతి రాజవంశం ఎంతగానో ప్రాముఖ్యతనిచ్చింది. ఇంతేకాకుండా అమ్మవారి గుడులు, అటు తర్వాత హనుమంతుని దేవాలయాలకు, కుతుబ్‌షాహీల కాలం నుంచి దర్గాలకు కేంద్రంగా ఉంటూ వచ్చినవి. గ్రామసేవలు అందించే 12 కులాలు చెరువులపై ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడి బతికేవి.

ఇంతేకాకుండా బతకమ్మ పండుగ, బోనాల పండుగ, పీర్లపండుగ, పెండ్లీలకు, చావులకు, చెరువులకు అవినాభావ సంబంధమున్నది.కుల మతాలకు అతీతంగా తెలంగాణ ప్రజలు ఎంతో గొప్పగా చేసుకునే ఈ పండుగలలో బతుకమ్మలను, పీర్లను చివరి రోజున చెరువులలో నిమజ్జనం చేయడం ఆనవాయితీ. ఇంతేకాదు, చెరువు కేంద్రంగా అనేక కథలు సామెతలు, బతకమ్మ పాటలు పుట్టాయి. ఆధునిక తెలంగాణ సాహిత్య రంగాన్ని కూడా చెరువులు ప్రభావితం చేశాయి. లిఖిత సాహిత్యాన్నే తీసుకుంటే తొలిసారి హాలుని గాథా సప్తశతిలో చెరువుల ప్రస్తావన కనిపిస్తుంది. శేషాద్రి రమణకవులు, సురవరం, కాంచనపల్లి చినవెంకట రామారావు, పెద్దింటి అశోక్‌ కుమార్‌ గొప్ప కథలు రాస్తే, సరోజినీ నాయుడు గోరేటి వెంకన్న, నందిని సిధారెడ్డి సహా ఇతర తెలంగాణ కవులు కవిత రాశారు. ‘‘గండిపేట్‌కా పానీ హైదరాబాద్‌ బిర్యానీ’’ పలుకుబడి తెలిసిందే.గండిపేట చెరువు నీళ్లు తాగితే హైదరాబాద్‌కు వచ్చినవారు ఎవరైనా తిరిగి వెళ్లరన్నది దీనిలో అంతరార్థం. తెలంగాణలో వర్షాలు కురవకుంటే ఏటా వానాకాలంలో ముస్లింలు గండిపేట చెరువుకు వెళ్లి ప్రార్థనలు చేయడం రివాజు. ఇంతేకాకుండా తెలంగాణచరిత్రకు చెరువులే ఆధారమవడం మరో విశేషం. దక్కన్‌ను పరిపాలించిన ప్రతి రాజవంశం చెరువుల తవ్వకం జరిపినప్పుడల్లా శాసనాలు వేయడం ఒక రివాజు. వీటిలో క్రీిస్తుపూర్వం నాలుగవ శతాబ్దం నుంచి ఇటీవలి కాలం వరకు ఉన్నాయి. బ్రాహ్మి, ప్రాకృతం, తెలుగు, సంస్కృతం, పర్షియన్‌ భాషలలో ఉన్న ఈ శాసనాలు స్థానిక భాషా సంస్కృతులకు నిలయంగా మారాయి.సాహిత్యపరిశోధనకు, సాంఘిక చరిత్రలకు గొప్ప వనరుగా మిగిలి ఉన్నాయి.

భారతదేశంలో అత్యంత ప్రాచీన చరిత్ర గల భూభాగాలలో దక్కన్‌ పీఠభూమి, దండకారణ్యం విస్తరించిన భూభాగాలకు దక్షణాపథం అన్నది ప్రాచీన నామం. ఉజ్జ్జయిని నుంచి కంచి వరకు విస్తరించిన ఈ భూభాగానికి గల ప్రాచీన నామాలలో మరోపేరు తెలంగాణ. దీనినే చరిత్రకారులు మహా తెలంగాణ అని పిలుస్తున్నారు. ఈ ప్రాంతాన విలసిల్లిన ప్రాచీన నాగరికత ఎంత విశిష్టమైందో చెరువులు, వరి, చెరుకుపంట చరిత్ర అంతటి ఘన చరిత్ర కలిగి ఉన్నది. దక్కన్‌ చెరువులపై చరిత్రకారుడు డీడి కొశాంబి రాసి ఉన్నారు. కొండలు, గుట్టలకు ఆవాసం కావడంతో రెండుగుట్టల మధ్య అడ్డుకట్ట కడితే అది చెరువుగా మారడం ఖాయం. ఈ తరహా వెసులు బాటు దక్కన్‌ పీఠభూమికి గుండెకాయ వంటి తెలంగాణకే ఉండడం విశేషం.

శాతవాహనులు, రాష్ట్రకూటుల పాలనకాలానికే తెలంగాణ వ్యవసాయరంగ చరిత్ర ఉన్నతి స్థితికి చేరుకున్నది. అందుకు దాఖలా వరి, చెరుకు పంటలే. వాటిని తొలిసారి దక్కన్‌లోనే పండించారన్నది చరిత్రకారుల అంచనా. బౌద్ధమతం తూర్పు దేశాలకు విస్తరించడానికి వరిపంట ప్రధానకారణమన్నదికూడా ఒక అభిప్రాయం. కాకతీయుల కాలానికి చెరువుల ఇంజనీరింగ్‌ ఉన్నత స్థాయికి చేరుకున్నది. మధ్యయుగాల చరిత్రను పరిశీలిస్తే 10నుంచి13వ శతాబ్దాల మధ్య స్థిరమైన రాజ్యాన్ని తెలంగాణ కేంద్రంగా కాకతీయులు స్థాపించారన్నది గమనించాలి.కాకతీయుల కాలంలో నిర్మాణమైన అనేక చెరువులకు సముద్రమన్న పేరు స్థిరపడిరది. అన్నిజిల్లాలలో సముద్రమన్న పేరుతో ఉన్న చెరువులు అనేకంగా కనిపిస్తాయి.గణప సముద్రం, ధర్మ సముద్రం, బాలసముద్రం, జగత్కేసరి సముద్రం, కాటసముద్రం, చౌడసముద్రం,విశ్వనాథ సముద్రము, సబ్బి సముద్రం, గౌరన సముద్రం, ఉదయసముద్రం, శ్రీవారి సముద్రం, శనిగరం చెరువు, శివసముద్రం, శంకర సముద్రం, అన్నాసాగర్‌వంటి చెరువులన్నీ కాకతీయుల కాలంలో, అటు తర్వాత నిర్మాణమైనవి. శాసనకర్తలు వాటిని సముద్రాలుగానే పేర్కొన్నారు. మహాకవి పోతన తల్లిగారి పేరుమీద చరువే వెలిసింది. పాల్కుర్కి సోమనసహా కాకతీయ యుగపు కవులు చెరువులన్నిటినీ సముద్రాలుగానే కీర్తించారు. వారికాలంలో, తర్వాత నిర్మాణమైన చెరువులను సమద్రాలని, సాగరాలని కవులు కీర్తించారు. మూడు వందల ఏళ్లపాటు కొనసాగిన వారి పాలనకు ప్రధాన భూమిక నీటి వనరులైన చెరువుల అభివృద్ధి, వ్యవసాయరంగ వికాసం, దానివల్ల పెరిగిన ఎగుమతులు, దిగుమతులు.అటు తర్వాత బహుమనీలు, కుతుబ్‌షాహీలు, గద్వాల,వనపర్తి,జటప్రోలు,నారాయణ్‌పూర్‌, గోపాల్‌పేట,దోమకొండ, సిర్నేపల్లి, మెతుకుసీమ సంస్థానాధీశులు కాకతీయుల వారసత్వాన్ని కొనసాగించారు. కుతుబ్‌షాహీలు హుస్సేన్‌సాగర్‌, మాసాహెబ్‌ ట్యాంకు, ఇబ్రహీంపట్నం చెరువులను పునర్నిర్మించి ఆనాటి అవసరాలకు తగినట్టుగా మలిచారు. జల్‌పల్లి , హుస్సేన్‌సాగర్‌ చెరువులు 15వ శతాబ్దంలో హైదరాబాద్‌ మంచినీటి అవసరాలను తీర్చాయి 17వ శతాబ్దంలో చెరువునీటి వివాదం కారణంగా బల్మూరి కొండల్‌ రాయుడు కథ రూపు దిద్దుకోవడం తెలంగాణ నీటి వనరుల ప్రశస్తిని తెలియ చేస్తున్నది. ఇందువల్లే కావచ్చు ఆకాశం నుంచి చూస్తే తెలంగాణ చెరువులు ఆకాశంలో చుక్కల వలే కనిపిస్తాయని ఓ విదేశీ పరిశోధకుడు వ్యాఖ్యానించారు.

శాతవాహన,రాష్ట్రకూటల కాలం నుంచి చెరువులు నిర్మాణంలో రాజవంశాలకు చెందిన మహిళల పాత్ర కనిపిస్తుంది. అంతకు మునుపు 9వ శతాబ్దంలో రాష్ట్రకూట రాణి అక్కా దేవిపాలన కాలంలో జమ్మికుంట చెరువు నిర్మాణం జరిగింది. రాణి రుద్రమదేవి బిడ్డ బయ్యమ్మ, బయ్యారం చెరువును నిర్మించి శాసనం చేశారు. రాణి రుద్రమ దేవి రక్త సంబంధికురాలు కుందమాంబ మూడు చెరువులను నిర్మించి శాసనాలను వేశారు. కులీకుతుబ్‌షాకు కూతురు హయత్‌బక్షి బేగం మాసాహెబ్‌ టాంక్‌ చెరువును నిర్మించారు. రాచకొండరాణి దేవీ నాగాంబిక నాగారం గ్రామంలో చెరువును తవ్విస్తూ ఒక శాసనం వేయించారు. అది రాచకొండ చరిత్రకు విలువైన వనరుగా మిగిలింది. 18వ శతాబ్దంలోనే వనపపర్తికి చెందిన రాణి శంకరమ్మ సప్తసముద్రాలను నిర్మించడం అవి నేటికి వనపర్తి ప్రాంతంలో ప్రజలకు అందుబాటులో ఉండడం తెలిసిందే. మెతకుసీమ నేలిన రాణిశంకరమ్మ అనేక చెరువులను నిర్మించారు.సిర్నేపల్లి రాణి జానకమ్మ కూడా నిజామాబాద్‌ జిల్లాలో గొప్ప చెరువులను నిర్మించారు.

17వ శతాబ్దంలో అధికారంలోకి వచ్చిన నిజాం రాజవంశీయులు చెరువుల బాగోగులకు ఇతోధిక ప్రాధాన్యత నిచ్చారు. 1857 అనాటి హైదరాబాద్‌ రాష్ట్రంలో ఆధునిక సంస్కరణలు చేపట్టిన సర్‌ సాలార్‌జంగ్‌ చెరువులు,మోట బావులు,ఊటబావులు ఇతర జలవనరులమరమ్మతుల కోసం వాటి అభివృద్ధికి ప్రతేకంగా ఒక శాఖనే ఏర్పాటు చేశారు. దానిపేరు దఫ్తార్‌యే` తలాబ్‌, బౌలి( లేక్స్‌ అండ్‌ వెల్స్‌ డిపార్ట్‌మెంట్‌) ఏర్పాటు చేసి వాటికి మరమ్మతులు చేపట్టారు. వ్యవసాయోత్పత్తులను ఇతోధికంగా పెంచారు. ఈ కార్యాలయానికి మెదక్‌ పట్టణం కేంద్రం కావడం మరో విశేషం. మొదట భారీ ప్రాజెక్టుల వైపు మొగ్గు చూపి ఇచ్చంపల్లి వంటి ప్రాజెక్టు (17వ శతాబ్దం చివరిభాగం) కు రూపకల్పన చేసి విరమించుకున్నారు. అటు తర్వాత ఫ్రెంచ్‌ ఇంజనీర్లను నియమించి తెలంగాణ వ్యాప్తంగా కొత్త జలవనరుల వినియోగానికి పూనుకున్నారు. ఆంగ్ల వలసపాలకుల భారీ ప్రాజెక్టులను తిరస్కరించి తొలినాళ్లలో మధ్యరకం నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణానికి పూనుకున్నారు. అడవులకు, గ్రామీణ జీవనానికి ఎటువంటి విఘాతం కలగకుండా చేయడం దీని లక్ష్యం. ఫ్రెంచి ఇంజనీర్ల సాంకేతికత ఇందుకు కారణం. 1860లలో మొదలైన ఈ ప్రాజెక్టులలో భాగమే హైదరాబాద్‌ నగరంలోని మిరాలం చెరువు, మెదక్‌ జిల్లాలోని ఘనపురం, ఖమ్మంలోని పాలేరు, నల్గొండ జిల్లాలోని డిండి, ఆదిలాబాద్‌ లోని సబర్‌మాడ్‌లు.ఇందులో భాగంగా 32 ప్రాజెక్టుల వరకు నిర్మించారు, ఇంతేకాకుండా లక్నవరం, ఇబ్రహీంపట్నం, ఇంజాపూర్‌ చెరువులకు మరమ్మతులు చేపట్టారు. వరదల కారణంగా మూసీ నదిపై గండిపేట చెరువును, ఈసీ నదిపై హిమాయత్‌ నగర్‌ చెరువును నిర్మించారు. చివరి నిజాం ప్రభువు మిరాలం చెరువులో ఒడ్డున సహజ సిద్ధంగా ఊట చెలిమె నీళ్ల ఇందుకు కొస మెరుపు .

పెద్దపెల్లి జిల్లా మా కొలనూరులో మూడు చెరువులు ఉన్నాయి అందులో ఊర చెరువు గ్రామానికి సజీవ సరస్సు. ఉమ్మడి రాష్ట్రంలో ఈ చెరువులో పూడిక తీయకపోవడం వలన వర్షాకాలంలో వానలు పడితేనే నిండేది. పూడిక ఎక్కువగా ఉండటం వలన యాసంగి పంటలకు అతి కష్టముగా నీరు అందేది . ఎండాకాలంలో నీరు నిలువ లేకపోవడం వలన పశువులకు మరియు ఇతర అవసరాలకు అత్యంత క్లిష్ట పరిస్థితి ఉండేది. మన ముఖ్యమంత్రి అపర భగీరథుడు చంద్రశేఖర్ రావు ముందు చూపుతో మిషన్ కాకతీయ లో భాగంగా పూడిక తీయడం వలన మరియు కాలేశ్వరం గంగతో నీరు చేరి సంవత్సరం పొడుగునా నీరు పుష్కలంగా లభిస్తున్నది. తద్వారా గ్రామంలో పచ్చదనం ఏర్పడి పర్యావరణ సమతుల్యం ఏర్పడినది.

సేకరణ
దండంరాజు రాంచందర్ రావు
రిటైర్డ్ డిప్యూటీ సూపరింటెండెంట్ సింగరేణిభవన్ హైదరాబాద్
9849592958