చైనా బలగాలు కదులుతున్నాయ్.. జర భద్రం
– భారత్‌కు పెంటగాన్ హెచ్చరిక
– సరిహద్దులో డ్రాగన్ మోహరింపు
న్యూఢిల్లీ,మే14(జనంసాక్షి): చైనా ఇటీవలికాలంలో తన రక్షణ సామర్థ్యాన్ని అంచెలంచెలుగా పెంచుకుంటూ పోవడంపై భారత్ ఆందోళన చెందుతోంది. మరోవైపు జాగ్రత్తగా ఉండాలని పెంటగాన్ భారత్‌ను హెచ్చరించింది. అంతేకాకుండా భారత సరిహద్దుల్లో చైనా సైనిక మోహరింపు మరింతగా పెంచింది. ప్రపంచంలోని వివిధ ప్రదేశాల్లో చైనా సైనిక స్థావరాల ఉనికి కూడా పెరిగిపోతున్నది. మరీ ముఖ్యంగా పాకిస్థాన్‌లో ఆ దేశ ప్రమేయం భారీగా ఉన్నదని అమెరికా రక్షణవిభాగం పెంటాగాన్ హెచ్చరించింది. ప్రజా గణతంత్ర చైనాకు సంబంధించిన సైనిక, భద్రత పరిణామాలపై పెంటగాన్ 2016వ సంవత్సరానికి రూపొందించిన నివేదికను అమెరికా కాంగ్రెస్‌కు సమర్పించింది. అనంతరం జరిగిన విలేకర్ల సమావేశంలో తూర్పు ఆసియా రక్షణ వ్యవహారాల డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీ అబ్రహాం ఎం. డెన్మార్క్ ఈ వివరాలు తెలిపారు. చైనా వైఖరి వెనుకనున్న అసలు ఉద్దేశాన్ని చెప్పడం కష్టమని డెన్మార్క్ అన్నారు. టిబెట్‌లో చైనా సైనిక కమాండ్‌ను ఆధునీకరించడంపై అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన మాట్లాడుతూ అంతర్గత సుస్థిరతను కాపాడుకోవడానికి అంతర్గత పరిశీలనలు ఎంతవరకు దోహదం చేశాయో చెప్పడం కష్టమన్నారు. అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి ఆష్టన్ కార్టర్ ఇటీవల ఇండియాలో జరిపిన పర్యటన అత్యంత సానుకూల ఫలితాలను ఇచ్చిందన్నారు. భారతదేశంతో ద్వైపాక్షిక సంబంధాలను మరింత పెంచుకోవడం కొనసాగిస్తామన్నారు. దీనికి చైనాతో సంబంధం లేదన్నారు. ఇండియా సహజంగానే ముఖ్యమైన దేశమన్నారు. ఆ దేశానికి ఉన్న విలువ ఆధారంగానే సంబంధాలు ఏర్పరచుకుంటున్నట్లు తెలిపారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో, మరీ ముఖ్యంగా పాకిస్థాన్‌లో చైనా స్థావరాలు, బలగాలు పెరుగుతున్నాయని అమెరికా రక్షణ శాఖ హెచ్చరించింది. పాకిస్థాన్‌తో చైనాకు దీర్ఘకాలిక స్నేహ సంబంధాలు, వ్యూహాత్మక ప్రయోజనాలు ఉన్నాయని పేర్కొంది. అంతర్జాతీయంగా చైనా ఆర్థిక ప్రయోజనాలు విస్తరిస్తుండటంతో సుదూర సముద్రాల్లో చైనా నావికాదళం సేవలు అవసరమనే డిమాండ్ పెరుగుతున్నట్లు తెలిపింది. అమెరికా, రష్యా, భారత్ రక్షణ సామర్థ్యానికి పోటీగానే చైనా ఇటీవలికాలంలో తన అణ్వాయుధ సామర్థ్యాన్ని మరింతగా ఆధునీకరించుకుంటున్నదని పెంటాగాన్ తెలిపింది. ఈ మూడు దేశాలతో పోటీ వల్ల తన వ్యూహాత్మక దాడి సామర్థ్యాన్ని చైనా మరింత విస్తృత పరుచుకుంటున్నదని వివరించింది. అణ్వాయుధ రంగంలోని వివిధ యూనిట్లపై మరింత నియంత్రణ సాధించడానికి ఆ దేశం ప్రయత్నిస్తున్నదని, ఇందులో భాగంగానే అణ్వాయుధాల కమాండ్, కంట్రోల్, కమ్యూనికేషన్‌ను మరింత ఆధునీకరిస్తున్నదని పెంటాగాన్ తెలిపింది. మొబైల్ క్షిపణలు, వార్‌హేడ్స్, వాటిని స్వతంత్రంగా మోసుకెళ్లే రీ ఎంట్రీ వెహికిల్స్, వాటికి సహాయపడే యంత్రాలు.. తదితర వాటిని నూతన తరం సాకేంతకతతో విసృత పరుచుకొని.. అమెరికా, రష్యాకు దీటుగా అణ్వాయుధ నిరోధ వ్యవస్థను చైనా పటిష్టం చేసుకుంటున్నదని వివరించింది.