జగన్‌ బెయిల్‌ పిటిషన్‌ వాయిదా కౌంటర్‌ దాఖలుకు గడువు కోరిన సీబీఐ

హైదరాబాద్‌, నవంబర్‌ 21 :వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దాఖలు చేసిన స్టాట్యుటరి బెయిల్‌ పిటిషన్‌పై విచారణ శుక్రవారానికి వాయిదా పింది. జగన్‌ దాఖలు చేసుకున్న బెయిల్‌ పిటిషన్‌పై కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేసేందుకు సమయం కావాలని సీబీఐ గడువు కోరింది. దీంతో సీబీఐ ప్రత్యేక కోర్టు విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది. చట్టబద్దంగా 90 రోజుల్లో విచారణ పూర్తి కావాల్సి ఉండగా.. సీబీఐ ఆ విషయంలో విఫలం అయ్యిందని, అందువల్ల తనకు బెయిల్‌ ఇవ్వాలని జగన్‌ గత శుక్రవారం సీబీఐ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. నిర్ణీత గడువులోగా సీబీఐ విచారణ పూర్తి చేసి, చార్జిషీట్‌ దాఖలు చేయలేకపోయిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. సీబీఐ దర్యాప్తు కావాలనే కాలయాపన చేస్తోందని, తనను అరెస్టు చేసి 90 రోజులు దాటినా.. దర్యాప్తు పూర్తి చేయకండా కాలయాపన చేస్తోందని వివరించారు. అరెస్టు అయి 90 రోజులు గడిచిపోవడంతో.. సీఆర్పీసీ సెక్షన్‌ 167 (2) కింద తాను బెయిల్‌ పొందేందుకు అర్హుడనేనని, తనకు బెయిల్‌ మంజూరు విజ్ఞప్తి చేశారు. ఆయన పిటిషన్‌ను స్వీకరించిన న్యాయస్థానం బుధవారం విచారణ జరిపింది. జగన్‌ బెయిల్‌ పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేసేందుకు సమయం కావాలని సీబీఐ ఈ సందర్భంగా కోరింది. దీంతో న్యాయస్థానం సీబీఐకి రెండ్రోజుల గడువిస్తూ.. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.