జిల్లాను సశ్యశ్యామలం చేస్తాం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వెల్లడి

సంగారెడ్డి, అక్టోబర్‌ 31 : జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొని ఉన్నప్పటికీ రైతులు కష్టించి పంటలు పండిస్తున్నారని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఆయన బుధవారంనాడు సంగారెడ్డిలోని ఫల పరిశోధన కేంద్రంలో విలేఖరులతో మాట్లాడారు. జిల్లాలో ఇందిరమ్మబాట విజయవంతం అయిందని ముఖ్యమంత్రి హర్షం ప్రకటించారు. జిల్లాను మరింత  సశ్యశ్యామలం చసేందుకు కృషి చేస్తానని ముఖ్యమంత్రి వెల్లడించారు.  జిల్లాలోని 9 నియోజకవర్గాల్లో 456 కోట్ల రూపాయలు విలువ చేసే అభివృద్ధి పనులకు శంకుస్థాపన, మరి కొన్ని పనులకు ప్రారంభోత్సవాలు నిర్వహించామని అన్నారు. ప్రజలకు, రైతులకు సాగు, తాగు నీటి కోసం అధిక నిధులను కేటాయించామని ఈ నిధులతో సాగు, తాగు నీరు కల్పించే చర్యలు చేపడుతామని అన్నారు. ఇందిరజల ప్రభ ద్వారా ఎస్సీ, ఎస్టీల భూముల సాగుకు నీటిని అందించే ఏర్పాట్లు చేశామని ఇందు కోసం వంద కోట్ల రూపాయలు చిన్ననీటి వనరుల అభివృద్ధికి కేటాయించామని అన్నారు. అత్యాధునికమైన టెక్నాలజి ద్వారా సర్వే జరిపి చెక్‌డ్యాముల నిర్మాణం, నీటి నిల్వపై పరిశోధనలు జరుగుతున్నాయని అన్నారు. అప్పటికే ఏడు జిల్లాలో పను ప్రారంభించామని అన్నారు. మత్స్యకారులు నివసించే ప్రాంతాల్లో మెరుగైన సేవలు కల్పిస్తామని అన్నారు. సాగునీటి కోసం వంద కోట్లను విడుదల చేయనున్నామని అంతుకు మించి అదనంగా ప్రత్యేక ప్యాకేజీని అందిస్తామని అన్నారు. జిల్లాలో పారిశ్రామిక రంగాన్ని మరింత అభివృద్ధికి చర్యలు చేపడుతామని అన్నారు. పరిశ్రమలు ఒదిలే విశవాయుల వల్ల ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయని ఎమ్మెల్యేలు తన దృష్టికి తీసుకువచ్చారని అన్నారు. కంపెనీల యాజమాన్యాలు విశవాయులను నిర్మూలించేందుకు అత్యాధునిక పద్దతులను వినియోగించి వావారణ కాలుష్యాన్ని నిరోధించాలని ముఖ్యమంత్రి పారిశ్రామిక వేతలను విజ్ఞప్తి చేశారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పరిశ్రమలు మెదక్‌ జిల్లాలో ఉన్నాయని ఆయన అన్నారు. నాగార్జున సాగర్‌, శ్రీశైలం ప్రాజెక్టులోకి అనుకున్న మేరు నీరు వస్తే విద్యుత్‌ సమస్య తొలిగిపోతుందని ముఖ్యమంత్రి అన్నారు. ఆర్‌ఎల్‌ఎన్‌జి నుంచి 10 మిలియన్‌ యూనిట్ల  విద్యుత్‌ను పొందేందుకు ఆ సంస్థకు నిధులు చెల్లించామని త్వరలోనే విద్యుత్‌ సమస్య తీరుతుందని ముఖ్యమంత్రి అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర సమాచార శాఖ మంత్రి డి.కె అరుణ, భారీ పరిశ్రమల శాఖ మంత్రి గీతారెడ్డి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సునీతాలక్ష్మారెడ్డి, ప్రభుత్వ విప్‌ జగ్గారెడ్డి, ఆరోగ్య శాఖ మంత్రి కొండ్రు మురళి, ఎమ్మెల్యేలు నర్సారెడ్డి, ముత్యంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.