జిల్లావ్యాప్తంగా మీ-సేవా కేంద్రాలు
గుంటూరు, జూలై 18: జిల్లావ్యాప్తంగా 70 మీ-సేవా కేంద్రాలు ప్రారంభమై కార్యకలాపాలు సాగిస్తున్నాయని జాయింట్ కలెక్టర్ యువరాజ్ అన్నారు. పొన్నూరు తహశీల్దార్ కార్యాలయానికి విచ్చేసిన జెసి యువరాజ్ విలేకరుల సమావేవంలో మాట్లాడుతూ మరిన్ని మీ-సేవా కేంద్రాలను త్వరలో ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. జనాభా అత్యధికంగా ఉన్న అర్బన్ ఏరియాలో రెండు కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేలా మీ-సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రెవెన్యూ సంబంధిత సర్వీసులను అందించడానికి ఇప్పటికే రికార్డులను ఆన్‌లైన్ చేసినట్లు తెలిపారు. రికార్డులో తప్పులను సరిచేసుకునేందుకు ప్రతి రైతు కూడా ఖచ్చితంగా అడంగల్ కాపీని మీ-సేవా కేంద్రాల ద్వారా పొందాలన్నారు. మీ-సేవా కేంద్రాల సమస్యలపై స్థానిక తహశీల్దారు, డిప్యూటీ కలెక్టర్‌కు ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఈ ఏడాది 27 కోట్ల నీటి పన్నులు లక్ష్యం కాగా 50శాతం వసూలైనట్లు తెలిపారు. అక్రమాలు జరగకుండా చర్యలు చేపడతామన్నారు.