జీవ వైవిధ్య సదస్సుకు వచ్చే ప్రధానిని అడ్డుకుంటాం

హైదరాబాద్‌,  అక్టోబర్‌  4 (జనంసాక్షి) :

జీవ వైవిధ్య సదుస్సులో పాల్గొనేందుకు ఈ నెల 16న హైదరాబాద్‌ వస్తున్న ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ను అడ్డుకోవాలని తెలంగాణ రాజకీయ జేఏసీ నిర్ణయించింది. గురువారం జేఏసీ నాయకులు కోదండరాం నాయకత్వంలో బీజేపీ, సీపీఐ కార్యాలయాలకు వచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ మార్చ్‌కు అన్ని విధాల సహకరించినందుకు ఆ రెండు పార్టీలకు జేఏసీ కృతజ్ఞతలు తెలిపింది. భవిష్యత్తులో కూడా పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో తెలంగాణపై కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసన తెలపాలని, ప్రధానిని అడ్డుకోవాలని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి చేసిన సూచనను జేఏసీ అంగీకరించింది. ఈ సందర్భంగా అందుకు సంబంధించిన యాక్షన్‌ ప్లాన్‌ను సిద్ధం చేయాలని నిర్ణయించారు. భవిష్యత్తులో కూడా జేఏసీని సంపూర్ణంగా బలపరుస్తామని కిషన్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఉద్యమకారులపై ప్రభుత్వ దమన కాండను ఖండించారు. తెలంగాణ సాగుతున్న ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ తెలంగాణ మార్చ్‌కు అనుమతి ఇచ్చినట్టే ఇచ్చి తెలంగాణ వాదులను అడుగుగడుగునా అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడాన్ని తీవ్రంగా ఖండించారు. కేసీఆర్‌ ఢిల్లీ టూర్‌ వ్యూహాత్మకమేనని కోదండరాం స్పష్టం చేశారు. ఆయన కాంగ్రెస్‌ పెద్దలతో తెలంగాణపై చర్చలు జరిపేందుకు ఢిల్లీ వెళ్లారని, దగాకోరు రాజకీయాల కోసం ఆయన ఢిల్లీ వెళ్లలేదని కోదండరాం స్పష్టం చేశారు. భవిష్యత్తులో అందరినీ కలుపుకుని పోయి ఉద్యమాన్ని ఉధృతం చేసి ఢిల్లీ మెడలు వంచేందుకు ప్రయత్నిస్తామని  ఆయన చెప్పారు. ఇందులో భాగంగానే బీజేపీ, సీపీఐ నాయకులకు కృతజ్ఞతలు తెలిపేందుకు వచ్చామన్నారు.