జెసి మాటలు రాయలసీమ ప్రాంతానికి తూట్లు ఆర్‌జెపి కొత్తూరు
కర్నూలు, జూలై 26 : మాజీ మంత్రి జెసి దివాకర్‌రెడ్డి రాయలతెలంగాణకే తన మద్దతు అని చేసిన వ్యాఖ్యలు రాయలసీమ ప్రాంతానికి తూట్లు పొడవడమే అవుతుందని రాయలసీమ జనతా పార్టీ వ్యవస్దాపకులు కొత్తూరు సత్యనారాయణగుప్త విమర్శించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాయలసీమ ప్రాంత నాయకులు ఎవరికి వారు సొంత ప్రకటనలు చేసే ముందు రాయలసీమ ప్రజలు చేసిన త్యాగాలను గుర్తించుకుని ప్రకటనలు చేయడం అలవర్చుకోవాలన్నారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టాల్సిన తెలంగాణ వారు తెలుగువారి మహానేతల విగ్రహాలను ధ్వంసం చేసిన విషయాన్ని మరువకూడదన్నారు. తెలంగాణ ప్రాణత్యాగాలకు గౌరవించాలని, ఒక వైపు రాయల తెలంగాణ వద్దు అని తెలంగాణ నాయకులు ప్రకటనలు చేస్తుంటే రాయలసీమ ప్రాంత కొంతమంది నాయకులు వారికి విరుద్దంగా ప్రకటనలు చేయడం అవివేకమన్నారు. పౌరుషం లేని వారిగా వారి చెప్పుచేతుల్లో బతకాల్సిన అవసరం రాయలసీమ ప్రజలకు లేదన్నారు. మరో సారి ఆయన ప్రకటన చేసే ముందు కలియుగ దేవుడు వెంకన్న జిల్లాను(చిత్తూరు), అన్నమయ్య పుట్టిన గడ్డ(కడపజిల్లా)ను వదులు కోవడం సముచితం కాదన్న విషయాన్ని గుర్తించుకుని ప్రకటనలు చేయడం మంచిదన్నారు. మరికొందరు నేతలు సమైక్యవాదం లేదా ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం ప్రకటనలు కూడా సరైంది కాదని, ఇప్పటికే రాయలసీమ ప్రజలు పొగొట్టుకున్న నష్టాన్ని సమైక్యవాదులు, రాయలతెలంగాణ వాదులు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.