టిడిపి కొల్లేరు పాదయాత్ర ప్రారంభం – ఇది రాజకీయం కాదు : ఎర్రన్నాయుడు

ఏలూరు, జూలై 16 : కృష్ణ, పశ్చిమగోదావరి జిల్లాలో విస్తరించిన కొల్లేరు సరస్సుపై ఆధారపడిన పేదలకు న్యాయం చేయాలని కోరుతూ, వారు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో భాగంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు టిడిపి సంకల్పించిన పాదయాత్ర సోమవారం నాడు ఆట్టహాసంగా ప్రారంభమైంది. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో వెలమలపేట రామాలయం వీధి నుంచి పాదయాత్రను ఆ పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ కేంద్ర మంత్రి కె.ఎర్రన్నాయుడు ప్రారంభించారు. కైకలూరు, ఉండి, దెందులూరు నియోజకవర్గాలకు చెందిన టిడిపి ఎమ్మెల్యేలు జయమంగళం వెంకటరమణ, వేటుకూరి శివరామరాజు (శివ), చింతమనేని ప్రభాకర్‌ సహా పెద్ద సంఖ్యలో టిడిపి నేతలు, కార్యకర్తలు పాదయాత్రలో పాల్గొన్నారు. మూడు రోజుల పాటు జరిగే పాదయాత్ర కొల్లేరు గ్రామాల మీదుగా బయలుదేరి ఏలూరు కలెక్టరేట్‌ వద్ద ముగియనున్నంది. ఈ సందర్భంగా ఎర్రన్నాయుడు మాట్లాడుతూ, ఇది రాజకీయ యాత్ర కాదని, అన్యాయానికి గురైన కొల్లేరు ప్రజల జీవన మనుగడ కోసమే పాదయాత్ర అని అన్నారు. కొల్లేరులో అక్రమ చేపల చెరువుల ధ్వంసం తరువాత అక్కడి ప్రజల జీవనోపాధి దెబ్బతిన్నదని, మూడు లక్షల నుంచి ఉపాధి కరువై అలమటిస్తున్నారని అన్నారు. పొట్ట చేత పట్టుకొని వేల మంది వలస పోయే దుస్థితి కల్పించింది కాంగ్రెస్‌ పార్టీనేనని అన్నారు. కొల్లేరు అభయారణ్య విస్తరణ పరిధిని ఐదవ కాన్టూరు నుంచి మూడవ కాన్టూరుకు పుదిస్తామని అసెంబ్లీలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి చేసిన తీర్మానాన్ని అమలు చేయనందునే ఇక్కడి ప్రజల జీవన మనుగడ దుర్బరంగా మారిందని అన్నారు. ఐదవ కాన్టూరు నుంచి మూడవ కాన్టూరు మధ్య భూములను కొల్లేరు నివసించే పేదలకు పంచాలని ఎర్రన్నాయుడు డిమాండ్‌ చేశారు. మాజీ మంత్రి మాగంటి బాబు మాట్లాడుతూ, కొల్లేరు ఆపరేషన్‌ పేరుతో వైఎస్‌ రాజశేఖరరెడ్డి పేద ప్రజల పొట్టకొట్టారని ధ్వజమెత్తారు. కొల్లేరు సరస్సును చిత్తడి నేలల సంరక్షణ చట్టం నుంచి మినహాయించాలని అప్పుడే దానిపై ఆధారపడిన పేదలకు న్యాయం జరుగుతుందని అన్నారు. ఎమ్మెల్యే శివ మాట్లాడుతూ, కొల్లేరులో ప్రజలు జీవించే హక్కును కాలరాసే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు. కొల్లేరు కాలుష్యానికి గురైందని ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందడం లేదని వాపోయారు. మంచినీటి కోసం అలమటించే దురవస్థ కాంగ్రెస్‌ ప్రభుత్వం వల్లనే ఏర్పడిందని అన్నారు. మంచినీటి కోసం ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం కొల్లేరు కాన్టూరు కుదింపుపై ప్రజలను మోసగిస్తోందని ఆయన ధ్వజమెత్తారు. కొల్లేరులో మనుషుల కన్న పక్షుల ప్రాణాలకే విలువ ఇస్తున్నారని ఇది ఎంతో దుర్మార్గమని ఎమ్మెల్యే ప్రభాకర్‌ విమర్శించారు. కొల్లేరు ప్రజలకు న్యాయం జరిగే వరకు ఆందోళన కొనసాగిస్తామని జిల్లా పార్టీ కన్వీనర్‌ కె.సీతామహాలక్ష్మి స్పష్టం చేశారు.