టీమిండియా గాడిన పడేనా..

రేపు ఇంగ్లాండ్‌తో తలపడనున్న ధోనీసేన
కొలంబో ,సెప్టెంబర్‌ 22 :ట్వంటీ ట్వంటీ ప్రపంచకప్‌లో భారత జట్టు రెండో మ్యాచ్‌కు సిధ్ధమైంది. రేపు కొలంబో వేదికగా డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌తో తలపడబోతోంది. ఆఫ్ఘనిస్థాన్‌పై పోరాడి నెగ్గిన ధోనీసేన ఈ మ్యాచ్‌లో పూర్తిగా గాడిన పడాలని భావిస్తోంది. ఇప్పటికే సూపర్‌ ఎయిట్‌కు అర్హత సాధించినప్పటకీ… రెండు జట్లూ మ్యాచ్‌ను తేలికగా తీసుకోవడం లేదు. ప్రస్తుతం భారత్‌ను పలు సమస్యలు వెంటాడుతున్నాయి. ముఖ్యంగా ఓపెనింగ్‌ జోడీ సెహ్వాగ్‌ , గంభీర్‌ ఇప్పటి వరకూ స్థాయికి తగినట్టు ఆడలేకపోయారు. భారీ స్కోరు సాధించాలంటే ఓపెనర్లు వేసే పునాదే కీలకం. అయితే వార్మప్‌ మ్యాచ్‌తో పాటు పసికూన ఆఫ్ఘనిస్థాన్‌పై వీరూ-గౌతీ జోడీ దారుణంగా విఫలమైంది. దీంతో వీరిద్దరూ గాడిన పడితేనే భారీస్కోరుపై ఆశలుపెట్టుకోవచ్చు. దీనికి తగ్గట్టే నెట్‌ ప్రాక్టీస్‌లో సెహ్వాగ్‌ , గంభీర్‌ తీవ్రంగా శ్రమించారు. భారీ షాట్లతోనే ఎక్కువ ప్రాక్టీస్‌ చేశారు. మిగిలిన బ్యాట్స్‌మెన్‌లో అందరూ ఫామ్‌లో ఉన్నారు. ముఖ్యంగా పరుగుల వరద పారిస్తోన్న వైస్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ మరోసారి చెలరేగడం ఖాయంగా కనిపిస్తోంది. చివర్లో ధోనీ కూడా ధాటిగా ఆడుతుండడంతో బ్యాటింగ్‌పై ఆందోళన లేదు. ఇక ఏడాదిన్నర తర్వాత జట్టులోకి తిరిగి వచ్చిన యువరాజ్‌సింగ్‌ పైనే అందరి చూపూ ఉంది. గత మ్యాచ్‌లో 18 పరుగులే చేసిన యువీ బౌలింగ్‌లో మాత్రం 3 వికెట్లతో రాణించాడు. 2007 వరల్డ్‌కప్‌లో ఇంగ్లాండ్‌పై యువీ విధ్వంసకర ఇన్నింగ్స్‌ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుత ఇంగ్లాండ్‌ సారథి స్టువర్ట్‌ బ్రాడ్‌ బౌలింగ్‌లో యువీ ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు కొట్టడం ఎవ్వరూ మరిచిపోలేదు. దీంతో యువీపైనే భారీ అంచనాలున్నాయి.అయితే బౌలర్ల వైఫల్యం భారత్‌కు సమస్యగా మారింది. పేస్‌తో పాటు స్పిన్‌ విభాగంలోనూ మనవాళ్ళు ఆశించిన స్థాయిలో రాణించలేదు. బౌలర్ల దారుణ వైఫల్యం కారణంగానే తొలి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్‌ బ్యాట్స్‌మన్‌ చివరి వరకూ పోరాడారు. జహీర్‌ , ఇర్ఫాన్‌ ఇంకా లైన్‌ అండ్‌ లెంగ్త్‌ అందిపుచ్చుకోలేదు. అలాగే స్పిన్‌ విభాగంలో అశ్విన్‌ పర్వాలేదనిపిస్తున్నా… పూర్తి స్థాయిలో మాత్రం కాదు. మొత్తం విూద బౌలింగ్‌ గాడిన పడితేనే భారత్‌ గెలుపుపై ఆశలు పెట్టుకోవచ్చు. సూపర్‌ ఎయిట్‌ స్టేజ్‌కు ముందు అన్ని విభాగాల్లోనూ మెరుగయ్యేందుకు ఈ మ్యాచ్‌ చక్కని అవకాశంగా కూడా చెప్పొచ్చు. మరోవైపు ఆఫ్ఘనిస్థాన్‌పై ఘనవిజయం సాధించిన ఇంగ్లాండ్‌ ఫుల్‌ జోష్‌లో ఉంది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ¬దాలో భారత్‌ను నిలువరించేందుకు సిధ్దమవుతోంది. బ్యాటింగ్‌లో ల్యూక్‌ రైట్‌ , హేల్స్‌ ఫామ్‌లో ఉన్నారు. ముఖ్యంగా తొలి మ్యాచ్‌లో రైట్‌ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 55 బంతుల్లో 8 ఫోర్లు , 6 సిక్సర్లతో 99 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అటు బౌలింగ్‌లో బ్రాడ్‌తో పాటు డెర్న్‌బాచ్‌ , సమ్మిత్‌ పటేల్‌ , స్వాన్‌ సమిష్టిగా రాణించారు. పటిష్టమైన భారత బౌలింగ్‌ లైనప్‌ను కట్టడి చేసేందుకు ఇంగ్లాండ్‌ పేసర్లే కీలకంగా చెప్పొచ్చు. అటు భారత స్పిన్‌ మంత్రాన్ని ఎదుర్కొనేందుకు ఇంగ్లాండ్‌ కసరత్తులు చేస్తోంది. నెట్‌ ప్రాక్టీస్‌లో ఇంగ్లాండ్‌ క్రికెటర్లు స్పిన్‌ బౌలింగ్‌లోనే ఎక్కువ సేపు ఆడారు. పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలించినప్పటకీ… సెకండ్‌ సెషన్‌లో బౌలింగ్‌కు కూడా సహకరిస్తుందని తెలుస్తోంది. మొత్తానికి ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు గ్రూప్‌ ఎ నుండి రెండు విజయాలతో అగ్రస్థానంలో నిలుస్తుంది.
భారత తుది జట్టు (అంచనా)
గంభీర్‌ , సెహ్వాగ్‌ , కోహ్లీ , రోహిత్‌శర్మ , యువరాజ్‌సింగ్‌ , ధోనీ , సురేష్‌ రైనా , ఇర్ఫాన్‌ పఠాన్‌ , అశ్విన్‌ , జహీర్‌ఖాన్‌ , బాలాజీ
ఇంగ్లాండ్‌ తుది జట్టు (అంచనా) ః
క్విసెట్టర్‌ , హేల్స్‌ , ల్యూక్‌ రైట్‌ , మోర్గాన్‌ , బెయిర్‌స్టో , బట్లర్‌ , సమ్మిత్‌ పటేల్‌ , స్టువర్ట్‌ బ్రాడ్‌ , గ్రేమ్‌ స్వాన్‌ , డెర్న్‌బాచ్‌ , స్టీవెన్‌ ఫిన్‌
టీ ట్వంటీ వరల్డ్‌కప్‌లో రేపు ః
గ్రూప్‌ డి – న్యూజిలాండ్‌ ృ పాకిస్థాన్‌ – మధ్యాహ్నం 3.30 నుండి

గ్రూప్‌ ఎ – భారత్‌ ృ ఇంగ్లాండ్‌ – రాత్రి 7.30 నుండి