ఢిల్లీలో తెలంగాణ ..

గవర్నర్‌ సోనియా, చిదంబరం, టీ ఎంపీలతో భేటీ
రాష్ట్రపతి ఎన్నికల తర్వాత తెలంగాణ ప్రకటించే అవకాశం !
న్యూఢిల్లీ, జూన్‌ 26(జనంసాక్షి):
ఢిల్లీకి తెలంగాణ సెగ తాకింది. తెలంగాణ అంశంపై సానుకూల నిర్ణయాన్ని ప్రకటించే దిశగా చక చక అడుగులు ముందుకు సాగుతున్నాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు తుది రూపం ఇచ్చే పనిలో కేంద్రం బిజీగా ఉంది. తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ఎంపీలు లతోపాటు రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ, కేంద్రమంత్రులు వయలార్‌ రవి, ఏకే ఆంటోనీ, చిదంబరం, రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్‌ ముఖర్జీని విడివిడిగా కలిసి తాజా రాజకీయ పరిస్థితిని వివరించినట్టు సమాచారం. ఈ సందర్భంగా ఎవరికి వారే నివేదికలు సమర్పించారు. అయితే తెలంగాణ ప్రాంత ఎంపీలు మాత్రం తెలంగాణ అంశాన్ని వెంటనే తేల్చాలని, ఏ మాత్రం నాన్చివేత ధోరణి అవలంబించకుండా సానుకూల నిర్ణయాన్ని ప్రకటించాలని, ఇందుకు ఇదే అనువైన సమయమని నొక్కి చెప్పారు. రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ మంగళవారమంతా కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేతలతో సుదీర్ఘ మంతనాలు జరిపారు. ఇదే సమయంలో టీ కాంగ్రెస్‌ ఎంపీలు కూడా కేంద్రంలో కీలకమైన మంత్రులతో భేటీ అవుతున్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన మరికొందరు మంత్రులు సైతం మంగళవారం రాత్రి హస్తినకు బయలు దేరి వెళ్లారు. రాష్ట్రపతి ఎన్నికలఅనంతరం అన్ని నివేదికలను పరిశీలించి తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించాలని యూపీఏ ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.