తక్కువ ధరకే మంచి రకం బియ్యం: జాయింట్‌ కలెక్టర్‌

నిజామాబాద్‌, జూలై 10 : జిల్లా ప్రజలకు తక్కువ ధరకే మంచి రకం బియ్యం అందించాలనే ప్రభుత్వ ఆదేశాల కనుగుణంగా చర్యలు తీసుకున్నామని సంయుక్త కలెక్టర్‌ హర్షవర్దన్‌ తెలిపారు. నిజామాబాద్‌ జిల్లా రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సుభాష్‌నగర్‌ రైతు బజార్‌లో ఏర్పాటు చేసిన సన్న బియ్యం పంపిణీ కేంద్రాన్ని మంగళవారం సంయుక్త కలెక్టర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బహిరంగ మార్కెట్‌లో బిపిటి తదితర సన్న బియ్యం ధరలు అధికంగా ఉన్నందున రైస్‌ మిల్లర్లతో రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం రూ.29 రూపాయలకే బియ్యం ప్రజలకు అందించడానికి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. ఈ రోజు నిజామాబాద్‌ నగరంలో పులాంగ్‌, సుభాష్‌నగర్‌ రైతు బజార్లలో ఈ కేంద్రాలను ప్రారంభించామన్నారు. ఈ పథకంపై ప్రజల స్పందన పరిశీలించి వారం రోజుల్లో బోధన్‌, కామారెడ్డి, ఆర్మూర్‌లలో కూడా ఈ కేంద్రాలను ప్రారంభిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్‌వో కొండల్‌రావు, ఎఎస్‌వో ఉదయ్‌కుమార్‌, వైస్‌ మిల్లర్ల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు దయానంద్‌గుప్త, మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.