తుపాన్‌ వల్ల నష్టపోయిన రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటాం : సిఎం

ఖమ్మం, నవంబర్‌ 6 : నీలం తుపాన్‌ ప్రభావంతో నష్టపోయిన రైతాంగాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మంగళవారంనాడు ఆయన ఖమ్మం జిల్లా దమ్మపేట మండలంలోని గణేశ్‌పాడు గ్రామంలో తుపాన్‌ ప్రభావంతో నష్టపోయిన పంట పొలాలను సమీక్షించారు. అనంతరం రైతులతో మాట్లాడారు. రైతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. వరదలో చనిపోయిన రెండు కుటుంబాలకు ఒక్కొక్కరికి ఒక లక్షా 50వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ వరదల వల్ల నష్టపోయిన రైతుల వివరాలను, వారి సాగు భూముల వివరాలను సేకరించాలని అధికారులను ఆదేశించామన్నారు. త్వరలో నివేదికలు అందుతాయని, అందిన వెంటనే కేంద్రప్రభుత్వం నుంచికానీ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ పంటల బీమా అందజేస్తామని తెలిపారు. తుపాన్‌ ప్రభావంతో పంటలు నష్టపోవడమే కాక పశువులను కూడా నష్టపోయిన వివరాలను సేకరించాలని, తర్వాత నివేదిక పంపాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయ భూముల్లో ఇసుక మేటా వేసిందని, ఇది ఒక రకంగా అన్నదాతలకు ఇబ్బంది కలుగుతుందని, అయినా కూడా ప్రభుత్వం వారిని అన్ని విధాలా ఆదుకుంటుందని అన్నారు.  అనంతరం బేచ్‌పల్లి చెరువుకు గండిపడిన ప్రదేశాలను పరిశీలించారు. సాధ్యమైనంత త్వరగా గండి పూడ్చాలని అధికారులను ఆయన ఆదేశించారు.