తెలంగాణ ప్రయోజనాలు బీఆర్‌ఎస్సే కాపాడుతుంది

బీసీ చైతన్యం ఒక్కటవ్వాలి
60శాతం ఉన్నవాళ్లు ఎందుకు ఓడిపోవాలి?
కోదాడ నుంచే విజయబావుట ఎగురవేయాలి
గెలిపిస్తే 10 కోట్లతో కోదాడలో బీసీ భవన్‌ కడతాం
కోదాడ సూర్యాపేటల మధ్య డ్రైపోర్ట్‌ కూడా నిర్మిస్తాం
కర్నాటకలో 5 గంటల కరెంట్‌ ఇచ్చే కాంగ్రెస్‌ను నమ్మొద్దు
తుంగతుర్తి, ఆలేరు ప్రాంతాలను చూస్తే ఎంతో తృప్తి కలుగుతోంది
ప్రజా ఆశీర్వాద సభల్లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు రైతుబంధును ఆదరాబాదరగా ఇవ్వలేదు. మొదలు పెట్టినప్పుడు రూ.4వేలు పెట్టుకున్నాం. ఆ తర్వాత రూ.5వేలు పెంచుకున్నాం. సంవత్సరానికి కొంచెం పెంచుకుంటూ రూ.16వేలకు పెంచుకుంటామని చెప్పాం. ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి రైతుబంధు వేస్ట్‌ అంటున్నడు. జగదీశ్వర్‌రెడ్డి, మల్లయ్య యాదవ్‌, కేసీఆర్‌ రైతుబంధు ఇవ్వాలి అంటున్నారు. మరి ఎవరు కావాలి? పేదల సంక్షేమం, రైతుల సంక్షేమం, రాష్ట్ర భవిష్యత్‌ కోసం తపనతో పనిచేస్తున్న పార్టీ బీఆర్‌ఎస్‌ మాత్రమే.
` సీఎం కేసీఆర్‌
కోదాడ/తుంగతుర్తి/ఆలేరు (జనంసాక్షి):జనాభాలో 60శాతం ఉన్న బీసీలు, బీసీ చైతన్యం చూపించాలని, సభలో లొల్లి చేయడం కాదు నవంబర్‌ 30న మల్లయ్య యాదవ్‌ గెలుపునకు పనిచేయాలని సీఎం కేసీఆర్‌ నిర్దేశించారు. సమైక్యాంధ్రలో కోదాడ ప్రాంతంలో పొలాలు ఎండిపోతున్నాయని రైతులు తన దగ్గరికి వచ్చారని, కోదాడ నుండి హాలియా వరకు పాదయాత్ర చేస్తుంటే హుజూర్‌నగర్‌ ప్రాంతాల్లో భూములపై మోరసగడ్డలు ఉన్నాయని రైతులు నీళ్ల కోసం బావులు తవ్వారని గుర్తుచేశారు. నాడు జల దోపిడీ జరుగుతుంటే నోరు మూసుకున్న దద్దమ్మలు కాంగ్రెస్‌ నాయకులని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎద్దేవా చేశారు. 2000 సంవత్సరంలో తాను మాట్లాడేవరకు కాంగ్రెస్‌లో మాట్లాడే మొగోడే లేడన్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాలేశ్వరం జలాలను సాగర్‌ జలాలతో అనుసంధానం చేశామన్నారు. ఆదివారం కోదాడ, తుంగతుర్తి, ఆలేరులో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్‌ ప్రసంగించారు.
కోదాడలో మల్లయ్య యాదవ్‌ ఓడిపోతారని టికెట్‌ ఇవ్వద్దని చెప్పారని, ఓడిపోయిన బాధ లేదని మళ్లీ టికెట్‌ ఇచ్చానని అన్నారు. బీసీలు ఎస్సీలు మైనార్టీలు ఏకమై మలయాదవ్ను గెలిపించాలని కోదాడలో 10 కోట్లతో బీసీ భవన్‌ నిర్మిస్తానని హామీ ఇచ్చారు. కోదాడ సూర్యాపేట మధ్య పారిశ్రామికంగా అభివృద్ధి జరిగేందుకు డ్రై పోర్టు నిర్మిస్తానని వరాల జల్లు కురిపించారు. కొంతమంది బలిసిన వాళ్ళు ఏకమై మల్లయ్య యాదవ్‌ ఓటమికి కుట్రలు పన్నుతున్నారని ప్రజలంతా ఏకమై కుట్రలను తిప్పి కొట్టాలన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి దళితబంధు పథకం అమలు చేయడం లేదని, కానీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ప్రజలు కట్టిన పనులు వృధా చేస్తున్నానని అంటున్నారని విమర్శించారు. కర్ణునికి కవచకుండలాలు ఎలాగానో తెలంగాణ రాష్ట్రానికి బీఆర్‌ఎస్‌ పార్టీ శ్రీరామరక్ష అన్నారు. తెలంగాణ ప్రజానీకాన్ని కడుపులో పెట్టుకొని చూసుకునే ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అన్నారు. కాంగ్రెస్‌ వాళ్ళ మాటలు నమ్మితే కాటకాలవైపే అన్నారు. సభలో మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి, హుజుర్‌నగర్‌, కోదాడ ఎమ్మెల్యేలు సైదిరెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్‌, ఎన్నికల పరిశీలకులు తక్కెళ్ళపల్లి రవీందర్‌రావు, తెలంగాణ ఉద్యమకారులు కనుమంత రెడ్డి శశిధర్‌ రెడ్డి, పార్టీలో పలు హోదాలో ఉన్న నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
తుంగతుర్తికి పట్టుబట్టి నీళ్లు..
గతంలో తుంగతుర్తి నుంచి వలసలు చూసి కన్నీళ్లు వచ్చేవని, గోదావరి జలాలను పట్టుబట్టి తుంగతుర్తికి తెచ్చుకున్నామని సీఎం కేసీఆర్‌ తెలిపారు. ఇప్పుడు తుంగతుర్తిని చూస్తే ఎంతో సంతృప్తి కలుగుతోందన్నారు. గతంలో ఎవరైనా తెలంగాణ గురించి మాట్లాడితే..నక్సలైట్లు అని జైలులో వేసేవారు. కేసీఆర్‌ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అని ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నా. చావునోట్లో తలపెట్టి తెలంగాణ సాధించాను. నాడు ఉద్యమంలో కనపడని వాళ్లు ఇప్పుడు మాట్లాడుతున్నారు. నేను సభల్లో చెప్పిన విషయాలపై గ్రామాల్లో చర్చ పెట్టండి. తెలంగాణ రాకముందు వలసలు, ఆకలిచావులు ఉండేవి. తలసరి ఆదాయంలో తెలంగాణ నెంబర్‌ వన్‌. తలసరి విద్యుత్‌ వినియోగంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. రాష్ట్రంలో భూగర్భజలాలు పెరిగాయి. యూపీలో ప్రజలకు అన్నానికి దిక్కులేదు. అక్కడి సీఎం ఇక్కడకు వచ్చి పాఠాలు చెబుతున్నారు. అల్ట్రా పవర్‌ప్లాంట్‌ను దామరచర్లలో ఏర్పాటు చేస్తాం. గాదరి కిశోర్‌ను లక్ష ఓట్ల మెజార్టీతో తుంగతుర్తి ప్రజలు గెలిపించాలి. ఉద్యమ సమయంలో గాదరి కిశోర్‌ జైలుకు కూడా వెళ్లారు’’ అని కేసీఆర్‌ పేర్కొన్నారు.
కాంగ్రెస్‌ను నమ్మకండి..
ఆలేరులో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. కరెంటు విషయంలో డీకే చేసిన వ్యాఖ్యలను ఎద్దేవా చేశారు. డీకే శివకుమార్‌ తీరు కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెడగొట్టినట్లు ఉందన్నారు. కర్ణాటక నుంచి వచ్చిన డీకే రంగారెడ్డి జిల్లాలో మాట్లాడుతూ కరెంటు విషయంలో సవాల్‌ చేశారని, ఆయన విసిరన సవాల్‌ హాస్యాస్పదంగా ఉందని సీఎం వ్యాఖ్యానించారు. ‘కేటీఆర్‌ మా గొప్పతనం మీకు తెలుసా..? మేం మా రాష్ట్రంలో 5 గంటల కరెంటు ఇస్తున్నాం. కావాలంటే వచ్చి చూసుకో’ అని డీకే శివకుమార్‌ గొప్పలకు పోయిండని సీఎం విమర్శించారు. తెలంగాణలో 24 గంటల కరెంటు ఇస్తుంటే.. కర్ణాటకలో తాము 5 గంటల కరెంటు ఇస్తున్నామని శివకుమార్‌ గొప్పగా చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. దేశంలో 24 గంటల కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని సీఎం చెప్పారు. ప్రధాని నరేంద్రమోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో కూడా 24 గంటల కరెంటు లేదన్నారు. మోదీ సర్కారు రైతుల బావులకు కరెంటు మీటర్లు పెట్టాలని ఆర్డర్‌ వేసిందని, లేకపోతే నిధుల్లో రూ.25 వేల కోట్లు కోత కోస్తమని హెచ్చరించిందని, అయినాసరే మీటర్లు పెట్టేది లేదని తాను తెగేసి చెప్పినట్టు వివరించారు. తెలంగాణ రైతాంగం బతుకులు ఇప్పుడిప్పుడే మారుతున్నాయని, ఇలాంటి సమయంలో మోటార్లకు మీటర్లు పెట్టి రైతుల దోచుకోవాలని చూడటం అన్యాయమని అన్నారు. కరువులతో అల్లాడిన ఆలేరు నియోజకవర్గం తెలంగాణ ఏర్పడిన తర్వాత అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నదని సీఎం చెప్పారు.