త్రివర్ణపతాక స్ఫూర్తి చాటిన ధీరులకు నీరాజనం

ముంబయి: స్వాతంత్ర దినోత్సవం  అనగానే త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి బాధ్యత తీరిందనుకోవటం, మరికొందరైతే దాన్ని కూడా సరైన దిశలో ఎగురవేయలేకపోవటం లాంటి దృశ్యాలన్ని సాధారణ విషయాలే. అయితే త్రివర్ణపతాక స్ఫూర్తిని నిజంగా అందిపుచ్చుకున్న ఆ వ్యక్తులు మాత్రం జాతికే గర్వకారణంగా  నిలిచారు. జూన్‌ 21న ముంబయి సచివాలయం మంత్రాలయలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు భవనంపైకి ఎగబాకాయి. ఆసమయంలో ఎవరికి వారు తమ ప్రాణాలను కాపాడుకునేందుకు పరుగులు పెట్టారు. అక్కడ పనిచేసే ఏడుగురు ఉద్యోగులు మాత్రం భవనం పైన రెపరెపలాడే జాతీయజెండాకు ప్రమాదం జరగనుందని గుర్తించారు. ఏమాత్రం భయపడకుండా ధైర్యంగా భవనం పైవరకు వెళ్లి త్రివర్ణపతాకాన్ని అందిపుచుకున్నారు. దాన్ని అక్కడనుంచి తీస్తే ఏ పద్థతిలో పట్టుకోవాలో అలాగే జాగ్రాత్తగా పట్టుకుని కిందికి మంటల మథ్య నుంచి దిగివచ్చారు. ఆ సమయంలో ప్రాణాలు పోయే అవకాశం ఉన్నా పతాకం జాతి గౌరవానికి చిహ్నమని దాన్ని కాపాడటం తమకు గర్వకారణమని అంతకంటే తమ ప్రాణాలు ఎక్కువకాదని వారు చెప్పటం ఎందరినో కదిలించింది. వారికి ఆగస్టు 15న సన్మానం చేస్తామని అనేక సంస్థలు ఆహ్వానం పంపాయి. అయితే వారు మాత్రం తమ కార్యాలయంలో ప్రభుత్వం నిర్వహించే జెండా పండుగకే తమ ప్రాధాన్యమని స్పష్టం చేశారు. దేశంలోని అస్తవ్యస్త పరిస్థితులపై నిరాశచెందేవారికి ఇలాంటి సంఘటనలే దేశం బాగుపడే అవకాశం ఉందనే సంకేతాలు ఇస్తామ. జాతికి ఇలాంటివారే స్ఫూర్తిప్రదాతలు.