దక్షిణకోస్తాకు భారీవర్ష సూచన

విశాఖపట్నం,నవంబర్‌22: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ మధ్య బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లోస్థిరంగా కొనసాగుతోంది. ఇదే పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం సైతం ఏర్పడింది. వీటి ప్రభావంతో రాగల 24 గంటల్లో దక్షిణ కోస్తాలో పలు చోట్ల, ఉత్తర కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా వానలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. దక్షిణ కోస్తాలో ఒకటి రెండు చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు సైతం కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. తీరం వెంబడి గంటలకు 45 నుంచి 50 కిలోవిూటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, సముద్రంలోకి వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇదిలావుంటే హైదరాబాద్‌లో అక్కడా చిరుజల్లులు కురిశాయి. ఆకాశం కొన్ని ప్రాంతాల్లో మేఘావృతమై ఉంది.