దళితబంధును రాష్ట్రమంతా అమలు చేయాలి

share on facebook


అప్పుడే ప్రభుత్వాన్ని దళితులు నమ్ముతారు: బిజెపి
నిజామాబాద్‌,ఆగస్ట్‌26(జనంసాక్షి): దళితబంధు పథకాన్ని ఒక్క హుజూరాబాద్‌లోనే గాకుండా అన్ని జిల్లాల్లో అమలు చేయాలని బీజేపీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. దళిత బంధు పథకాన్ని హుజూరాబాద్‌ నియోజ ర్గంలోనే అమలు చేయడం కేవలం రాజకీయ కుట్ర తప్ప మరోటి కాదన్నారు. దీనిని అన్ని నియోజకవర్గాల దళితులు గుర్తించాలని అన్నారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో
అమలు చేస్తేనే ప్రభుత్వ చిత్తశుద్దిని నమ్మగలమని అన్నారు. ఇప్పటివరకు దళితుడిని సీ ఎం చేస్తానన్న ప్రభుత్వం చేయలేదని, 3 ఎకరాల భూమి పథకం అటకెక్కిందన్నారు. ఎస్సీ కార్పొరే షన్‌ ద్వారా ఇచ్చే సబ్సిడీ రుణాలను సక్రమంగా ఇవ్వడం లేదని విమర్శించారు. దళితబంధు పథకాన్ని రాష్ట్రమంతటా అమలు చేయడం ద్వారా కెసిఆర్‌ తన చిత్తశుద్దిని చాటుకోవాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్క రైతుల ప్రభుత్వం అని చెప్పుకుంటూ మరో పక్క రైతులను ఆదుకోవడంతో పూర్తిగా విఫలం అయిందని అన్నారు. ఇందుకు నిదర్శనం గత నెల రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు పంట దెబ్బతిన్న రైతులకు నష్టపరిహారం అందించక పోవడమే అన్నారు. భారీ వర్షాల మూలంగా పలువురు రైతుల పంటలు కోతకు గురికావడం, నీట మునగడం జరిగిందని తూతూ మంత్రంగా అధికారులు సర్వే జరిపిన, ఇప్పటి వరకు రైతులకు ఎలాంటి పరిహారం అందలేదన్నారు. రైతులకు తక్షణమే పరిహారం అందజేయాలని లేని పక్షంలో రైతులపక్షాన పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ సందర్భంగా భారతీయ జనతాపార్టీ బలోపేతానికి ప్రతీఒక్కరు కృషిచేయాలని సహకరించాలని పిలుపు నిచ్చారు. రాబోయే రోజుల్లో పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని కార్యకర్తలు సిపాయిల్లా పని చేయాలని పేర్కొన్నారు.

Other News

Comments are closed.