ధర్మమే గెలిచింది : బత్తి జగపతి

మెదక్‌, జూన్‌ 15 : ధర్మం, ఆధర్మం మధ్య జరిగిన ఉప ఎన్నిక పోరులో ధర్మమే గెలిచిందని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కన్వీనర్‌ బత్తి జగపతి అన్నారు. పరకాలలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి ఓటమి చవి చూసినా నైతికంగా విజయం తమ పార్టీదేనని అన్నారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలందరూ పరకాలలో ప్రచారం చేసినా 1500 ఓట్ల అధిక్యంతోనే టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలిచారని అన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో, 2014 సాధారణ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధిక స్థానాలు కైవసం చేసుకుంటుందని ఆయన అన్నారు. తెలంగాణ వాదం ఈ ప్రాంతంలో సన్నగిల్లిందని, టీఆర్‌ఎస్‌పై ప్రజల్లో తెలంగాణ వాదం తగ్గిపోతుందన్నారు. పరకాలలో టీఆర్‌ఎస్‌ విజయం పట్ల మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ సంతోషం వ్యక్తం చేశారు.
పరకాలలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలుపు సందర్భంగా సంగారెడ్డిలో తెరాస నేతలు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. టపాసులు పేలుస్తూ ప్రజలకు స్వీట్లు పంచిపెట్టారు. పరకాలలో కాంగ్రెస్‌, టీడీపీ సమైక్య వాదులు ఎన్ని కుట్రలు పన్నినా తెలంగాణ వాదమే చివరకు గెలిచిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు జలాలుద్దీన్‌ బాబా తదితరులు పాల్గొన్నారు.