నగదు బదిలీతో ప్రభుత్వం దగా

శ్రీకాకుళం, ఆగస్టు 3 : చౌకధరల దుకాణాల ద్వారా పేదలకు అందిస్తున్న నిత్యావసర సరుకులు భవిష్యత్తులో అందించకుండా ఉండేందుకు నగదు బదిలీ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం దగా చేసేందుకు ప్రయత్నిస్తోందని సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి చాపర సుందర్‌లాల్‌ ఆరోపించారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో సీపీఐ, సీపీఎం సంయుక్త ఆధ్వర్యంలో ‘నగదు బదిలీని వ్యతిరేకిద్దాం, ఆహారభద్రతను కాపాడుకుందా’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సుందర్‌లాల్‌ మాట్లాడుతూ ప్రజలకు నేరుగా రాయితీతో కూడిన సరుకులు అందించడాన్ని నిలిపివేసి, నగదు బదిలీ పథకం తీసుకురావడంతో పేదలను సంక్షేమ పథకాలకు దూరం చేయడానికి ప్రయత్నించడం అన్యాయమన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి బవిరి కృష్ణమూర్తి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గత ఏడాది ప్రవేశపెట్టిన ఆహార భద్రత బిల్లు లోపభూయిష్టంగా ఉందన్నారు. సీపీఎం నాయకుడు పంచాది పాపారావు మాట్లాడుతూ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం ప్రతి కుటుంబానికి 35 కిలోల బియ్యం కిలో రెండు రూపాయలకు అందించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకుడు రంధి అయ్యప్ప, సీపీఎం నాయకుడు వి.జి.కె.మూర్తి, కె.పి.ఎస్‌.నాయుడు, డి.గణేష్‌, ఎస్‌ఎఫ్‌ఐ నాయకుడు చలపతిరావు తదితరులు పాల్గొన్నారు.