నల్లమలలో పూసి.. దండకారణ్యంలో ఒరిగిపోయిన ఎర్ర మందారం..

share on facebook


` ఆదివాసీల నడుమ విప్లవ సాంప్రదాయాలతో ముగిసిన ఆర్కే అంత్యక్రియలు
(తుది వరకు అదే బాట.. తుది శ్వాస వరకు తిరుగుబావుటా.. వంతు బాధ్యత ముగిసి భుజం మార్చుకోమన్నది)
ఖమ్మం,అక్టోబరు 16(జనంసాక్షి): మావోయిస్ట్‌ పార్టీ అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు అక్కిరాజు హరగోపాల్‌ అలియాస్‌ సాకేత్‌ అలియాస్‌ రామకృష్ణ అలియాస్‌ ఆర్కే అంత్యక్రియల ఫొటోలను మావోయిస్టు పార్టీ విడుదల చేసింది. తెలంగాణలోని పామేడు`కొండపల్లి సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టు లాంఛనాలతో ఆర్కే అంత్యక్రియలను నిర్వహించారు. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు ఆర్కే అంత్యక్రియలను పూర్తి చేశారు. ఆర్కే అంత్యక్రియలకు భారీగా మావోయిస్టులు హాజరయ్యారు.ఆర్కే మృతదేహంపై ఎర్ర జెండా ఉంచి మావోయిస్టులు నివాళులు అర్పించారు. ఈ అంత్యక్రియలకు గిరిజనులు పెద్ద సంఖ్యలో హాజరు అయ్యారు. వారంత విప్లవ నేతకు నివాళి అర్పించారు. గుంటూరు జిల్లా రెంటచింతల మండలం తుమృకోట గ్రామానికి చెందిన ఆర్కే తీవ్రమైన మధుమేహం, కీళ్ల నొప్పులు, కిడ్నీ వ్యాధితో ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో గురువారం ఉదయం మృతి చెందారు. ప్రస్తుతం కేంద్ర కమిటీ సభ్యుడిగా పనిచేస్తున్న ఆయన ఆంధ్ర ఒడిశా సరిహద్దు (ఏవోబీ) ఇన్‌ఛార్జిగా కూడా వ్యవహరిస్తున్నారు. 38 ఏళ్ల క్రితం ఉద్యమంలోకి వెళ్లిన ఆర్కే 2004లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జరిపిన చర్చలకు ఆంధ్ర రాష్ట్ర కమిటీ ప్రతినిధిగా హాజరయ్యారు. అంతకుముందు మావోయిస్టు పార్టీ అగ్రనేత అక్కిరాజు హరగోపాల్‌ అలియాస్‌ ఆర్కే మృతిని ఆ పార్టీ కేంద్ర నాయకత్వం ధ్రువీకరించింది. ఆయన మృతి చెందినట్టు పార్టీ కేంద్ర కమిటీ శుక్రవారం మధ్యాహ్నం ప్రకటించింది. ఈ మేరకు మావోయిస్టు పార్టీ అధికారిక ప్రతినిధి అభయ్‌ పేరుతో ఓ ప్రకటన విడుదలైంది. నిన్న ఉదయం 6గంటలకు ఆర్కే కన్నుమూసినట్టు వెల్లడిరచారు. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆర్కే.. డయాలసిస్‌ జరుగుతుండగా ప్రాణాలు విడిచారని పేర్కొన్నారు.’’ఆర్కే మృతి మా పార్టీకి తీరని లోటు. 1978లో ఆయన పీపుల్స్‌ వార్‌ సభ్యత్వం తీసుకున్నారు. 1982 నుంచి పూర్తికాలం కార్యకర్తగా వచ్చారు. 1986లో గుంటూరు జిల్లా కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 1992లో రాష్ట్ర కమిటీ సభ్యుడిగా.. 2000లో ఆంధ్ర రాష్ట్ర కార్యదర్శిగా.. 2001లో కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2004లో ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో కీలక పాత్ర పోషించారు. చర్చల తర్వాత ఆర్కే హత్యకు ప్రయత్నాలు జరిగాయి. 2004 నుంచి పదేళ్ల పాటు ఏవోబీ కార్యదర్శిగా కొనసాగారు. అలాగే, 2018లో కేంద్ర కమిటీ పొలిట్‌బ్యూరోలో ఆర్కేకు స్థానం లభించింది. 2018లో ఆర్కే కుమారుడు మున్నా మృతి చెందారు ‘’ అని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటనలో పేర్కొంది.
బోరున విలపించిన ఆర్కే భార్య శిరీష
ఆర్కే మరణాన్ని ధ్రువీకరిస్తూ మావోయిస్టు పార్టీ ప్రకటన చేయడంతో ఆయన భార్య శిరీష బోరున విలపించారు. దీన్ని ప్రభుత్వ హత్యగానే భావిస్తామన్నారు. ఆర్కే నిరంతరం ప్రజల కోసం పరితపించారని చెప్పారు. మావోయిస్టులకు పోలీసులు కనీసం వైద్యం అందనీయడంలేదని ఆరోపిస్తూ విలపించారు. ‘’ ప్రజల కోసం నా భర్త 40ఏళ్లుగా అలుపెరగని పోరాటం చేశారు. సమాజం ఉన్నతంగా ఉండాలని కోరుకున్నారు. తన ఆరోగ్యం, జీవితాన్ని కూడా పట్టించుకోకుండా ప్రజల కోసమే పనిచేశారు. కన్నబిడ్డను కూడా ఉద్యమానికే ఆర్కే అంకితం చేశారు. పోలీసులు అధర్మ యుద్ధం చేస్తున్నారు. మావోయిస్టులకు వెళ్లే ఆహారంలో విషం కలుపుతున్నారు’ అని ఆరోపించారు. మరోవైపు, టంగుటూరు మండలం ఆలకూరపాడులో నివాసం ఉంటున్న శిరీషను పలువురు విరసం నేతలు పరామర్శించారు.
ప్రజల కోసమే అమరుడయ్యాడు..:కల్యాణరావు
ఆర్కే మరణంపై విరసం నేత కల్యాణరావు తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. పార్టీ అధికారిక ప్రకటనతో ఆయన బోరున విలపించారు. ‘’ఆర్కే ప్రజల హృదయాల్లో ఉంటారు. ఆయన ప్రజల కోసం అమరుడయ్యారు. పోలీసులు వైద్యం అందకుండా చేశారు. వైద్యంఅందకుండా పోలీసులను మోహరించారు. ఆర్కే విప్లవకారుడిగా జీవించారు.. విప్లవకారుడిగానే మరణించారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తాం’’ అన్నారు.

Other News

Comments are closed.