నాందేడ్‌ ఎస్‌పీని ప్రశ్నించిన సీఐడీ?

హైదరాబాద్‌, జూలై 6 (జనంసాక్షి): సీబీఐ జాయింట్‌ డైరెక్టర్‌ వివి లక్ష్మీనారాయణ ఫోన్‌కాల్స్‌ వివరాలు బహిర్గతమైన వ్యవహారానికి సంబంధించి నాందేడ్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ను రాష్ట్రం నేర దర్యాప్తు విభాగం(సీఐడీ) బృందం ప్రశ్నించినట్టు తెలుస్తోంది. అయితే అలాంటిదేమీ లేదని, నాందేడ్‌ ఎస్‌పీ విఎన్‌ జాదవ్‌, సీఐడీ ఇన్‌చార్జి అదనపు డీజీపీ ఎస్‌. గోపాల్‌రెడ్డి చెప్పారు. సంబంధిత వర్గాల వివరాల మేరకు, నాందేడ్‌కి వెళ్లిన సీఐడీ బృందం తిరిగి హైదరాబాద్‌కు గురువారం సాయంత్రం చేరుకుందని, తమ దర్యాప్తు ప్రగతిని గోపాల్‌రెడ్డికి వివరించిందని తెలుస్తోంది. ఒక డిటెక్టివ్‌ ఏజెన్సీకి చెందిన కొద్ది మంది ఉద్యోగులను, లక్ష్మీనారాయణ కాల్స్‌ డేటా రికార్డుల లీకేజీకి సంబంధించి బీఎస్‌ఎన్‌ఎల్‌ వర్గాలను కూడా సీఐడీ బృందం ప్రశ్నించినట్టు భోగట్టా. ఈ విషయమై నాందేడ్‌ ఎస్‌పి జాదవ్‌ను సంప్రదించగా, తనను ఎవరూ ప్రశ్నించలేదని స్పష్టం చేశారు.