నాగార్జున అగ్రికెమ్‌లోరియాక్టర్‌ పేలి ముగ్గురు కార్మికులు మృతి?

17మందికి గాయాలు..మరో నలుగురు కెజిహెచ్‌కు తరలింపు
కొనసాగుతున్న సహాయక చర్యలు
పర్యవేక్షిస్తున్న కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి
శ్రీకాకుళం/హైదరాబాద్‌, జూన్‌ 30 : ఎచ్చర్ల మండలం చిలకపాలెంలోని నాగార్జున అగ్రికెమ్‌లో పేలుడు సంభవించింది. కార్మికుల,సిబ్బంది హాహాకారాలతో ఆ ప్రాంతమంతా మారుమోగింది. ముగ్గురు కార్మికులు మృతి చెంది ఉండొచ్చని..40మందికి గాయాలైనట్టు సమాచారం. ఈ దుర్ఘటన శనివారం ఉదయం 8.30-9గంటల మధ్య చోటు చేసుకుంది. అయిదు కిలోమీటర్ల మేర విష వాయువులతో కూడిన పొగ అలుముకుంది.. ఎచ్చెర్ల మండలం చిలకపాలెం వద్ద జాతీయరహదారికి ఇరువైపులా అయిదు కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ జామ్‌ అయింది.. పరిసర గ్రామాల్లోని ఇళ్లల్లోని వారిని, స్కూళ్లను ఖాళీ చేయించి వారిని ఇతర ప్రాంతాలకు తరలించారు. కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.అధికారికంగా 17మందికి గాయాలైనట్టు ఆయన తెలిపారు. శనివారం మధ్యాహ్నం రెండు గంటల సమయానికి స్థానికుల, కొందరు కార్మికుల కథనం మేరకు దుర్ఘటన వివరాలిలా ఉన్నాయి.
శనివారం ఉదయం 8.30-9గంటల మధ్య ఎచ్చెర్ల మండలం చిలకపాలెం జంక్షన్‌ వద్ద ఉన్న నాగార్జున ఆగ్రికెమ్‌లో రెండో రియాక్టర్‌ పేలింది. రసాయనాలతో కూడిన విష వాయువులు ఆ ప్రాంతమంతా దట్టంగా అలుముకున్నాయి. ఆ సమయంలో అక్కడ 100మందికి పైగా కార్మికులు విధి నిర్వహణలో ఉన్నట్టు సమాచారం. వారిలో కొందరు హాహాకారాలు చేస్తూ వెలుపలకు రాగా.. గాయాలపాలైన 17మందిని రిమ్స్‌ ఆసుపత్రికి తరలించినట్టు కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి తెలిపారు. మరో నలుగుర్ని మెరుగైన చికిత్స కోసం విశాఖపట్నంలోని కెజిహెచ్‌కు తరలించారు. సహాయక చర్యలను కలెక్టర్‌ పర్యవేక్షిస్తున్నారు. పేలుడు సంఘటన తెలిసిన వెంటనే ఆర్డీవో, రెవెన్యూ సిబ్బంది, తదితరులు సంఘటన స్థలం సమీపానికి చేరుకున్నారు. సహాయక చర్యలను ముమ్మరం చేశారు. అగ్నిమాపక యంత్రాల అధికారులు, సిబ్బంది మంటలను ఆర్పేందుకు మధ్యాహ్నం 2 గంటల వరకు శ్రమిస్తూనే ఉన్నారు. అదనపు యంత్రాలను జిల్లాలోని నలుమూలల నుంచి దుర్ఘటన ప్రాంతానికి అధికారులు రప్పించారు. దుర్ఘటన ప్రాంతం వైపునకు ఎవర్నీ వెళ్లనీయకుండా ఒక కిలోమీటరు ఆవతల నిలిపివేస్తున్నారు. కార్మికుల కుటుంబీకులను కూడా సంఘటన ప్రాంతానికి వెళ్లనీయడం లేదు. తమ వారేమయ్యారో తెలీక కార్మిక కుటుంబాలు, బంధువులు రోదిస్తూ జాతీయ రహదారిపైనే నిల్చుండిపోయారు. అగ్రికెమ్‌కు సమీపంలోని ఇళ్లల్లోని వారిని, ఆ చుట్టుపక్కల గ్రామాల్లోని వారిని వివిధ వాహనాల్లో అక్కడి నుంచి తరలించారు.
శ్రమిస్తున్న అగ్నిమాపక సిబ్బంది
శనివారం ఉదయం 8.30-9గంటల మధ్య దుర్ఘటన జరగడం.. సమాచారం అందడంతో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక యంత్రాల సిబ్బంది శ్రమిస్తున్నారు. అయినప్పటికీ మంటలు అంతకంతకు ఎగిసిపడుతుండడం.. దట్టమైన పొగ అలుముకోవడంతో సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. పొరుగు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి అగ్నిమాపక యంత్రాలను దుర్ఘటన ప్రాంతానికి రప్పించారు. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది హోరాహోరీగా పోరాడుతున్నారు. మంటలను అదుపు చేసేందుకు హైడ్రాలిక్‌ పంపులను రప్పించేందుకు అధికార యంత్రాంగం, అగ్ని మాపక కేంద్రం యంత్రాంగం యత్నిస్తోంది.
ముగ్గురు మృతి?
స్థానికులు మాత్రం దుర్ఘటన సమయంలో 100మందికి పైగా కార్మికులు విధుల్లో ఉన్నారని, పేలుడు వల్ల, విషవాయువుల వల్ల ముగ్గురు కార్మికులు మృతి చెంది ఉండొచ్చని అంటున్నారు. దుర్ఘటన సమయంలో ఒకర్ని తోసుకుంటూ మరికొరు ముందుకు కదిలే సమయంలో ఒకరిపై ఒకరు పడే అవకాశాలు ఉండడం వల్ల సుమారు మరో 20 మంది మృత్యువాత పడి ఉండొచ్చని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.40మందికి గాయపడినట్టు, వారిలో కొందరికి కాళ్లు, మరికొందరికి చేతులపైన తీవ్ర గాయాలైనట్టు సమాచారం. మరికొందరికి చెవుల్లో నుంచి, నోటిలో నుంచి రక్తం కారుతున్నట్టు తెలిసింది. ఇంకొందరు స్పృహతప్పి పడిపోయినట్టు తెలుస్తోంది. ఇదిలాఉండగా టీ బ్రేక్‌ సమయంలో దుర్ఘటన చోటు చేసుకోవడంతో ప్రాణనష్టం పెద్దగా జరిగి ఉండకపోవచ్చన్న చర్చలు సర్వత్రా కొనసాగుతున్నాయి.
సిఎం కిరణ్‌, పీసీసీ చీఫ్‌ బొత్స దిగ్భ్రాంతి
నాగార్జున అగ్రికెమ్‌లో జరిగిన ప్రమాదం పట్ల ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని, గాయపడిన వారిని సకాలంలో ఆసుపత్రులకు తరలించాలని, సమీప గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిం చాలని, అవసరమైతే పక్కనున్న జిల్లా యంత్రాంగం సేవలు కూడా వినియోగించుకోవాలని సూచించారు. తీసుకున్న చర్యలను, దుర్ఘటనకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేయాలని కోరారు. ఇదిలా ఉండగా కర్నూలు పర్యటనలో ఉన్న మంత్రి కొండ్రు మురళి దుర్ఘటన సమాచారం తెలీగానే హుటా హుటిన తన కార్యక్రమాలను రద్దు చేసుకుని ఎచ్చెర్లకు బయల్దేరి వెళ్లారు.