నాణ్యతలో వరపర్తి వేరుశనగ ముందు

విత్తన పరిశోధన సంస్థ ఏర్పాటుకు ప్రతిపాదనలు
వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి
వనపర్తి,మార్చి8(జ‌నంసాక్షి):  వనపర్తి జిల్లాలోని వేరుశనగ దేశంలోనే నాణ్యమైన ఉత్పత్తిగా పేరుగాంచిందని అందువ ల్ల ఇక్కడ జాతీయ వేరుశనగ విత్తన పరిశోధన సంస్థ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించామని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖామంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. కొల్లాపూర్‌, నాగర్‌కర్నూల్‌, అలంపూర్‌, వనపర్తి జిల్లాలోమామిడి పంటకు ప్రసిద్ధి అని దీనిని దృష్టిలో ఉంచుకొని కొల్లాపూర్‌, నాగర్‌కర్నూల్‌, ప్రాంతంలో మామిడి ప్రాసెసింగ్‌ కేంద్రాల ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామన్నారు. బీచుపల్లి వద్ద ఉన్న మూతపడిన ఆయిల్‌ మిల్లును పునరుద్ధరించి, వేరుశేనగ నూనె తయారీ ప్రారంభిస్తామన్నారు.
తెలంగాణలో విద్యుత్తు కష్టాలు శాశ్వతంగా తీరిపోయాయన్నారు. సాగులో సాంకేతిక పరిజ్ఞానాన్ని, వ్యవసాయ అధికారాలు, శాస్త్రవేత్తల సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. బతకుదెరువు, భద్రతను వ్యవసాయ రంగం కల్పించేలా త్వరలోనే పంట సమూహాలను ఏర్పాటు చేయనున్నామన్నారు.  తెలంగాణ రాష్ట్రంలో రానున్న రోజుల్లో రైతు రాజు కాబోతున్నాడని అన్నారు. 2022 నాటికి పంట దిగుబడి పెంచి రైతుల ఆదాయాలను రెండింతలు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుండగా, దానికి భిన్నంగా నాలుగేళ్ల  ముందే 2018 నాటికి రైతుల ఆదాయాలు పెరిగేలా రాష్ట్ర ముఖ్యమంత్రి  కెసిఆర్‌ చర్యలు తీసుకున్నారని వెళ్లడించారు. భారీ నీటిపారుదల, చిన్న నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం, సాగు నీటిరంగాన్ని పటిష్టపరచడం, 24 గంటలు ఉచిత విద్యుత్తు, రైతు బంధు కింద పెట్టుబడి సాయం భూ దస్త్రాల ప్రక్షాళన వంటివన్నీ రైతు ఆదాయాన్ని పెంపొందించేవే అన్నారు.  ఉత్పత్తి పెంపు, గిట్టుబాటు ధర, పంటకు డిమాండ్‌ను సృష్టించేందుకు చర్యలు చేపడతామన్నారు.

తాజావార్తలు