నిజాం పాలన.. నిప్పులాంటి నిజాలు


సెప్టెంబర్‌ 17 ముమ్మాటికి విద్రోహక దినమే

నిజాం రాజు సెక్యులర్‌ కాదు. పక్కా నియంత అని, ప్రజలను పట్టి పీడించాడని డప్పు కొట్టి ప్రచారం చేస్తున్న కొందరు బూటకపు నాయకులు, తమ అక్షరాలతో ప్రజల మెదడు తొలుస్తున్న మరి కొందరు మతతత్వవాద రచయితలు కావాలని ఓ ముస్లిం రాజును మతమౌఢ్యుడుగా ప్రచారం చేస్తున్నారు. నిజాం నవాబు వాస్తవ వ్యక్తిత్వం కనుమరుగు చేయడానికి కుట్ర చేస్తున్నారు. నవాబు ముమ్మాటికీ పక్కా సెక్యులర్‌. ఆయన పాలనలోని ఎన్నో విషయాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. వాటిలో కొన్నింటిని పరిశీలిస్తే ముందుగా చెప్పుకోవాల్సింది ఆయన హయాంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నిజాం పాలనకు వ్యతిరేకంగా జరిగిందని చెబుతుంటారు. ఈ పోరాటం నిజాం హయాంలో 1947లోనే మొదలైనా 1951 వరకు కొనసాగింది. ఈ పోరాటం ఒకవేళ నిజాంకు వ్యతిరేకంగా జరిగి ఉంటే 1948లో నిజాం గద్దె దిగగానే ఆగిపోవాల్సింది. కానీ, 1951 వరకు అంటే మూడేళ్లు ఎక్కువగానే సాగింది. దీన్ని బట్టి సాయుధ పోరాటం నిజాం పాలనకు వ్యతిరేకంగా జరిగింది కాదని స్పష్టమవుతున్నది. వాస్తవానికి ఈ పోరాటం భూముల కోసం, భూస్వాముల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా, సోషలిస్టు పాలన కోసం జరిగింది. కానీ, చరిత్రను వక్రీకరించి దాన్ని నిజాంకు అంటగడుతున్నారు. ఒకవేళ సాయుధ పోరాటం నిజాం పాలనకు వ్యతిరేకంగానే జరిగి ఉంటే, నవాబును భారత ప్రభుత్వం రాజ్‌ ప్రముఖ్‌గా ఎందుకు నియమించేది. ఇలా అబద్ధాలు ప్రచారం చేయడం కొందరు అలవాటుగా మార్చుకున్నారు. సాయుధ పోరాటం మొదలయ్యాక నిజాం పాలన సాగింది కేవలం ఒక్క సంవత్సరం మాత్రమే. ఈ కాలంలో మృతి చెందింది 2 వందల మంది కాగా, ఆ తరువాత మూడేళ్లలో 10 వేల మంది దాకా మృతి చెందారు. ఇది తెలుసుకోవాల్సిన పచ్చి నిజం. తెలంగాణ భారత్‌లో విలీనమయ్యాకే ఎక్కువ మంది అమాయకులు
బలయ్యారనే విషయం పై అంకెలను చూస్తే తెలిసిపోతుంది. నిజాం మతతత్వవాది అని కూడా చచ్చు రచనలు చేస్తున్నారు. కానీ, నిజాం పాలనలో ఏనాడూ మత విద్వేషాలు చెలరేగినట్లు ఆధారం ఒక్కటీ లేదు. ఓసారి అలీఘర్‌ ముస్లిం యూనివర్సిటీ నిర్మాణ సమయంలో కొందరు దాని ప్రతినిధులు నిజాంను కలిసారు. ఆయనతో దేశం మొత్తం మీద అత్యంత ధనిక రాజు మీరే కదా.. ఇది ముస్లింల కోసం నిర్మిస్తున్న విశ్వవిద్యాలయం కాబట్టి.. ఓ ముస్లిం రాజుగా ముస్లింల కోసం జరుగుతున్న ఈ సత్కార్యానికి మీరే అధిక చందా ఇవ్వాలని కోరారు. దీనిపై స్పందించిన నవాబు మీరు చెప్పింది నిజమే కావచ్చు.. కానీ, నేను పాలన అధిక శాతం హిందువులపై సాగుతున్నది. మా రాజ్య ఖజానాకు పెద్ద ఎత్తున పన్నులు కడుతున్నది హిందువులు. నా ఖజానాలో ఉన్నదంతా ప్రజల సొమ్ము కాబట్టి దాన్ని దుబారాగా దానం చేసే హక్కు నాకు లేదు. నేను ఇంతకు ముందు బెనారస్‌ హిందూ యూనివర్సిటీకి ఎంత సొమ్ము విరాళంగా ఇచ్చానో.. ఇప్పుడు ఈ ముస్లిం యూనివర్సిటీకి ఇస్తాను అని ఆ వచ్చిన ప్రతినిధులతో చెప్పి తాను సెక్యులర్‌ అని నిజాం ప్రభువు చెప్పకనే చెప్పాడు. అదే విధంగా తన ఆస్థాన మంత్రి పింగళి వెంకటరెడ్డిని పిలిపించి బెనారస్‌ యూనివర్సిటీకి ఎంత మొత్తం విరాళంగా ఇచ్చారో కనుక్కుని అంతే నిధులను అలీఘర్‌ యూనివర్సిటీకి ఇప్పించాడు. ఇదే కాకుండా నిజాం హయాంలో అత్యంత ప్రతిష్టాత్మక, ఉన్నత పదవి అయిన మంత్రిగా కూడా అక్కన్న, మాదన్నలు, పింగళి వెంకటరెడ్డి పని చేశారు. ఇంకో సంఘటన కూడా ఇక్కడ చెప్పుకోవాలి. హై కోర్టు నిర్మాణ సమయంలో నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్న ఇంజినీరు నవాబుతో హై కోర్టు నిర్మాణానికి ఆలయం అడ్డుగా ఉందని, దాన్ని తొలగిస్తేనే నిర్మాణ పనులు సజావుగా సాగుతాయని తెలిపాడు. దీనికి నిజాం ఆలయాన్ని తొలగిస్తే హిందువుల మనోభావాలు దెబ్బతింటాయని, అదే జరిగితే మనం వాళ్లకు అన్యాయం చేసినవాళ్లమవుతామని, అన్యాయపు పునాదుల మీద నిర్మించు న్యాయస్థానంలో న్యాయం జరుగుతుందని భవిష్యత్తులో ప్రజలు నమ్మరని, కాబట్టి ఆలయాన్ని అలాగే ఉంచి, న్యాయస్థాన నిర్మాణం సాగించాలని సదరు ఇంజినీరును ఆదేశించారు. అంతగొప్ప సెక్యులర్‌ నిజాం నవాబు. కానీ, కొందరు చరిత్ర తెలియని చరిత్రకారులు నాటి కాలంలో ప్రతాపరెడ్డి దేశ్‌ముఖ్‌ను ఉద్దేశించి జన నాట్య మండలి పుస్తకంలో రాసిన ‘బండెన్క బండి కట్టి.. పదహారు బండ్లు కట్టి’ అన్న పాటను నిజాంకు వ్యతిరేకంగా రాసినట్లు వక్రీకరించి ఓ సినిమాలో పాడించి నిజాం ప్రతిష్టను దెబ్బతీశారు. అదే కాలంలో వచ్చిన ‘రంగూ రంగుల నెహ్రయ్యా.. నీ రంగు బయటపడ్డది గదా నెహ్రయ్యా’ అంటూ వచ్చిన పాట మాత్రం నేడు ఎక్కడ కూడా వినిపించదు. ఇలా ప్రజలకు అన్యాయంగా అబద్ధపు సందేశాన్నిచ్చారు. నిజాం పాలన అనగానే ముందుగా రజాకార్ల అకృత్యాలు చేసినట్లు చెబుతుంటారు. ప్రజలపై దాడులు చేయించి, వారి ధన, మానాలను దోచుకున్నట్లు చెబుతుంటారు. రజాకార్ల దాడులు జరిగింది నిజమే. కానీ, వాటితో నిజాం నవాబుకు ఎలాంటి సంబంధం లేదు. రజాకార్లను తయారు చేసింది నిజాం కాదు ఖాసిం రజ్వీ అనే ఓ ప్రభుత్వాధికారి. ఈ దాడులు జరుగుతున్న విషయాన్ని కూడా నిజాంకు తెలుపలేదు. కొందరు దోపిడీ దొంగలు చేస్తున్నట్లు ఆయనకు చేరవేశారు. ఆ తరువాత విషయాన్ని తెలుసుకున్న నిజాం ఈ దాడులను తీవ్రంగా ఖండించాడు. ప్రభుత్వ సైన్యం ఉండగా, మళ్లీ రజాకార్లను తయారు చేయించి దాడులు చేయించాల్సిన అవసరం లేదని ఇక్కడ అందరూ అర్థం చేసుకోవాలి. నిజాం పాలనలో ప్రజలు మత సామర్యంతో సహజీవనం చేశారన్నది చరిత్రకెక్కని సత్యం. నిజాం జీవితం కూడా నిరాడంబరంగా సాగింది. ఆయన ఏనాడూ ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయలేదు. ఎవరైనా చేయాల్సి వస్తదని చెప్పినా ఒప్పుకోలేదు. టోపీల వ్యాపారాన్ని తన కుటుంబ సభ్యులతో చేయించి, ఆ వచ్చిన లాభాలతోనే తన దైనందిన కార్యక్రమాలు కానిచ్చాడు. ఇంత కన్నా బాగా నిజ్యాం సెక్యులర్‌ గురించి చెప్పుకోవాల్సి పని లేదు. ఇక నిజాం హయాంలో జరిగిందే అభివృద్ధి తప్పితే.. 1948 సెప్టెంబర్‌ 17 నుంచి నేటి వరకు పాలన సాగిస్తున్న సీమాంధ్ర పాలకులు చేసిందేమీ లేదన్నది సుస్పష్టం. ఆ విషయాన్ని పరిశీలిస్తే ఒక్క హైదరాబాద్‌లోనే నిజాం చేసిన అభివృద్ధి చాలు ఆయన రాజ్యదక్షతను చెప్పడానికి. నిజాం సాగర్‌ నుండి మొదలు పెడితే వేల సంఖ్యలో గొలుసుకట్టు చెరువులు, ఆర్డీఎస్‌ కూడా తవ్వించి, వాటి కింద లక్షల ఎకరాల్లో సాగుకు నీరందించిన దూరదృష్టి ఆయనది. ఒక్క హైదరాబాద్‌లోనే ఉస్మాన్‌ సాగర్‌, హిమాయత్‌ సాగర్‌, హుస్సేన్‌ సాగర్‌ లాంటి ఎన్నో మంచి నీటి జలాశయాలను తవ్వించాడు. ‘నిజాంకా నల్లా.. 24 ఘంటే ఖుల్లా’ అన్న నినాదంతో 24 గంటలు ప్రజలకు ఉచిత నల్లా కనెక్షన్లను ఇప్పించాడు. ఇక్కడ కూడా ఓ ప్రభుత్వాధికారి నల్లా నీటి సరఫరాకు సుంకం వసూలు చేద్దామని చెబితే దీనికి కూడా నిజాం ససేమిరా అన్నాడు. సహజ సిద్ధంగా వస్తున్న వనరు (ఖుద్రతీ)పై సుంఖం విధించే హక్కు మానవులకు లేదని సదరు అధికారికి స్పష్టం చేసిన నిజాం నవాబుది. ఇప్పుడున్న సీమాంధ్రుల పాలన చరిత్రను తిరగేస్తే ఉన్న మొత్తం చెరువులను కబ్జాలకు పాల్పడుతున్నారు. హుస్సేన్‌ సాగర్‌ నీళ్లయితే విషతుల్యం చేసేశారు. నల్లాపై ట్యాక్స్‌ ఎత్తివేసుడు దేవుడెరుగు ఉన్న నీళ్లను కూడా సరిగా చేయడం లేదన్నది మనం చూస్తూనే ఉన్నాం. వీళ్లకు నిజాం నవాబును నిందించే అర్హత ఉందా అని ఓ అందరూ ప్రశ్నించుకోవాలి. నిర్మాణాల విషయానికి వస్తే నేడు పాలన వ్యవహారాలు నడిచే మన రాజధాని హైదరాబాద్‌లో అన్ని ప్రధాన కార్యాలయాలు నిజాం హయాంలో నిర్మించినవే. సెక్రెటేరియట్‌తోపాటు ఉస్మానియా యూనివర్సిటీ, సెంట్రల్‌ లైబ్రరీ, హై కోర్టు, ఆస్పత్రుల్లో ఉస్మానియా హాస్పిటల్‌, నీలోఫర్‌ చిన్న పిల్లల దవాఖానా, ఎఎన్‌జే కాన్సర్‌ ఆస్పత్రి, నిమ్‌ దవాఖానా ఇలా చెప్పుకుంటూ పోతే ఆ నిర్మాణాల చరిత్రను రాస్తూ పది పుస్తకాలైనా అచ్చేయవచ్చు. నాటి సెప్టెంబర్‌ 17కు ముందు నుంచి నేటి సెప్టెంబర్‌ 17 వరకు జరిగిన అభివృద్ధిని పరికిస్తే సీమాంధ్ర పాలకులకు నిజాం నవాబుకు ఎక్కడ కూడా పోలిక లేదు. ఆయన బెస్ట్‌ అయితే వీళ్లు వేస్ట్‌ అని స్పష్టంగా తెలిసిపోతుంది. అంత మంచి పాలన నుంచి విద్రోహంగా విలీనానికి పాల్పడ్డ నాటి పాలకులది చారిత్రక తప్పిందమే. అందుకే, సెప్టెంబర్‌ 17 ముమ్మాటికీ విద్రోహ దినమే. నిజాం పక్కా సెక్యులరే. ఇది సత్య దూరం ఏ మాత్రం కాదు.
ఆగదు.. ఆగదు..మార్చ్‌ ఆగదు
జేఏసీ చైర్మన్‌ కోదండరాం
హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 17 (జనంసాక్షి) : ఆరు నూరైనా ఈ నెల 30న నిర్వహించేందుకు తలపెట్టిన తెలంగాణ మార్చ్‌ కచ్చితంగా నిర్వహించి తీరుతామని టీజేఏసీ చైర్మన్‌ కోదండరాం స్పష్టం చేశారు. సోమవారం తెలంగాణ విలీన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన హైదరాబాద్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కోదండరాం మాట్లాడుతూ ఎన్ని అవాంతరాలు ఎదురైన మార్చ్‌ కొనసాగుతుందని, ఈ కవాతుకు అన్ని వర్గాలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. సెప్టెంబర్‌ను 17ను అధికారికంగా నిర్వహించాలని తాము ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విచారం వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది మాత్రం ఈ రోజును తెలంగాణ ప్రజలు అధికారికంగా జరుపుకుంటారని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కోదండరాం ధీమా వ్యక్తం చేశారు. సీమాంధ్ర పాలకులు ఉన్నంత కాలం, తెలంగాణ బాగు పడదని, అందుకే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం మొదలైందని వివరించారు. దీనికి కిరణ్‌ సర్కారు కూడా మినహాయింపు కాదని, సోమవారం తెలంగాణ విలీన దినోత్సవంపై సీఎం చేసిన వ్యాఖ్యలే నిదర్శనమన్నారు. తెలంగాణ ఉద్యమం ప్రస్తుతం కీలక దశకు చేరుకుందని, తెలంగాణ మార్చ్‌తో ఉద్యమ సత్తా ఢిల్లీ పెద్దలకు తప్పక తెలుస్తుందన్నారు. తెలంగాణ ఏర్పాటు సమయం ఆసన్నమైందని, ఇక సంబురాలు చేసుకోవడమే తరువాయి అని ఆయన స్పష్టం చేశారు. మార్చ్‌ విజయవంతానికి ఇంటికో ఇద్దరు, చేతికో జెండాతో తరలిరావాలని కోదండరాం పునరుద్ఘాటించారు.
కాంగ్రెస్‌ రాష్ట్ర సదస్సు వాయిదా
హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 17 (జనంసాక్షి): రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేసే దిశగా నిర్వహించాలనుకున్న మేథోమధన సదస్సు వాయిదా పడింది. ఈ సదస్సుకు హజరయ్యే కేంద్ర నాయకుల సమయం లభించకపోవడంతో సదస్సును వాయిదా వేస్తున్నట్లు పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చెప్పారు. ఈ నెల 23వ తేదీన గాంధీ భవన్‌లో ఈ సదస్సు జరగాల్సి ఉంది. అధిష్ఠానం నాయకుల సమయాన్ని తీసుకొని సదస్సు జరిగే తేదీని వారితో చర్చించి త్వరలో ప్రకటిస్తామని సోమవారం బొత్స చెప్పారు. రాష్ట్ర సదస్సును నిర్వహించిన అనంతరం ప్రాంతాల వారీగా కూడా సదస్సులు నిర్వహించాలని యోచిస్తున్నట్టు చెప్పారు. నాయకులు, కార్యకర్తలనుంచి ఈ సదస్సును కనీసం రెండు రోజుల పాటు జరపాలనే సూచనలు వస్తున్నాయని చెప్పారు. తొలిరోజు నాయకులు, కార్యకర్తలనుంచి అభిప్రాయాలు, సూచనలు తీసుకోవడం, వాటిపై చర్చించడం, రెండవ రోజు అగ్రనాయకుల ప్రసంగాలు, వారి సలహాలు ఉండేలా సదస్సును నిర్వహిస్తే బాగుంటుందనే సూచనలు వస్తున్నాయన్నారు. కాగా, అంతకుముందు గాంధీ భవన్‌లో బొత్సతో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ నాయకులు భేటీ అయ్యారు. ఎంపీలు పొన్న ప్రభాకర్‌, వివేక్‌ తదితరులతో పాటు మాజీ మంత్రి కోమటిరెడ్డివెంకటరెడ్డి కూడా భేటీ అయ్యారు. రాష్ట్ర సదస్సును తెలంగాణ, సీమాంధ్రప్రాంతాలకు వేరు వేరుగా నిర్వహించాలని పిసీసీ అధ్యక్షుడికి విజ్ఞప్తి చేశాడు. రాష్ట్ర సదస్సు పేరుతో ఉభయ ప్రాంతాలకు ఒకే రోజున నిర్వహిస్తే నాయకుల మధ్య వైషమ్యాలు తలెత్తే ప్రమాదం ఉందని వారు సూచించారు. ఒకే వేదికపై సీమాంధ్ర కాంగ్రెస నేతలు తారసపడితే అనవసర వ్యాఖ్యలతో బేదాభిప్రాయాలు ఏర్పడి, వాతావరణం మరింత కలుషితమయ్యే పరిస్థితి ఉంటుందని వారు అభిప్రాయపడ్డారు. దీంతో ఈ నెల 23వ తేదీన జరగాల్సిన కాంగ్రెస్‌ మేథోమధన సదస్సు వాయిదా వేయడమే మేలని, పీసీసీ భావించింది. అధిష్టానం పెద్దల సమయం లభించకపోవడమే కారణమని పైకి చెబుతున్నప్పటికి ప్రాంతాల వారీగా, వేరు వేరుగా సదస్సు నిర్వహించాలని తెలంగాణ ప్రాంత ప్రజా ప్రతినిధులనుంచి వస్తున్న ఒత్తిడే సదస్సు వాయిదాకు కారణమని చెబుతున్నారు.
వడ్డీరేట్లు యథాతథం..సీఆర్‌ఆర్‌ 25బేసిక్‌పాయింట్లు తగ్గింపు
ముంబయి, సెప్టెంబర్‌ 17 (జనంసాక్షి): వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతూ ఆర్‌బిఐ నిర్ణయం తీసుకుంది. ఆర్‌బిఐ ద్రవ్య పరపతి సమీక్ష సమావేశం సోమవారం ఉదయం జరిగింది. అనంతరం సమీక్ష సమావేశం వివరాలను విడుదల చేసింది. రెపో రేటును యథాతథంగా ఉంచారు. సిఆర్‌ఆర్‌ మాత్రం కొద్దిగా తగ్గించారు. 0.25బేసిక్‌ పాయింట్లు తగ్గించారు. దీంతో 4.75గా ఉన్న సిఆర్‌ఆర్‌ రేటు 4.50కు చేరుకున్నట్టయింది. ఆర్థిక వ్యవస్థలోకి 17వేల కోట్ల రూపాయలు తరలి రానున్నాయి. రెపో రేటును 8శాతంగానే ఉంచింది. రెపో రేటు తగ్గితే రుణాలపై వడ్డీ రేట్లు తగ్గేవి. ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉన్నందున వడ్డీ రేట్లు తగ్గించలేమని ఆర్‌బిఐ పేర్కొంది. ఇదిలా ఉండగా ఈ ఏడాది జనవరిలో అరశాతం, మార్చిలో 0.75 బేసిక్‌ పాయింట్లు చొప్పున సిఆర్‌ఆర్‌ రేటును తగ్గించిన విషయం తెలిసిందే.