నిజామాబాద్‌ నగర శివారులో గుడిసెల తొలగింపు ఉద్రిక్తం

నిజామాబాద్‌: నగర శివారులో గుడిసెల తొలగింపు కార్యక్రమంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పులాంగ్‌వాగు, మాథవనగర్‌ డి-59 కాలువపై పేదలు వేసుకున్న గుడిసెల తొలగింపు శనివారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ ఉదయం భారీ పోలీసు బందోబస్తు మధ్య గుడిసెల తొలగింపునకు వచ్చిన రెవెన్యూ అధికారులను సీపీఐ, సీపీఎం,సీపీఐ (ఎంఎల్‌)  న్యూడెమోక్రసీ నేతలు, కార్యకర్తలు అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. అనంతరం అధికారులు పొక్లెయిన్ల సహాయంతో దాదాపు 600 గుడిసెలను తొలగించారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తా మని చెప్పి ఇవ్వకపోవడంతోనే ప్రభుత్వ స్థలాల్లో వారు గుడిసెలు వేసుకున్నారని నాయకులు తెలియజేశారు. మాజీ పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌ అనుచరులు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల ప్రోద్భలంతోనే అధికారులు గుడిసెలు తొలగించారని ఆరోపించారు. జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకే అక్రమణలను తొలగించామని రెవెన్యూ అధికారులు తెలియజేశారు.