నిబంధనలు పాటించాల్సిందే..

హైదరాబాద్‌, జూలై 10 : నిబంధనలను అతిక్రమిస్తున్న పబ్‌లు, బార్‌లపై పోలీసులు దృష్టి సారించారు. పగలు, రాత్రిళ్లు పబ్‌లు, బార్‌లపై కన్నేసి దాడులు నిర్వహిస్తున్నారు. ఇటీవల టానిక్‌ పబ్‌పై దాడి చేసిన పోలీసులు మంగళవారంనాడు జీవికె మాల్‌లోని క్యూబ్‌ పబ్‌పై దాడి చేశారు. మైనర్లకు మద్యం సరఫరా చేస్తున్నారన్న ఆరోపణలపై ఈ దాడులు నిర్వహించారు. తమకు అందిన సమాచారం మేరకే దాడి చేశామని, తమ దాడిలో మైనర్లు కూడా దొరికారని పోలీసులు చెప్పారు. మద్యం సేవించిందీ, లేనిదీ తెలుసుకునేందుకు బ్రీత్‌ ఎనలైజర్లతో తనిఖీలు నిర్వహిస్తున్నారు. మేజర్లతో పాటు మైనర్‌ యువతీ యువకులు కూడా పబ్‌లో మద్యం సేవించి తందనాలాడుతున్నారన్న సమాచారంతో వెస్ట్‌ జోన్‌ డిసిపి స్టీఫెన్‌ రవీంద్ర ఆదేశాల మేరకు పంజాగుట్ట ఎసిపి ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి. ఇదిలా ఉండగా తాము నిబంధనల మేరకే పబ్‌ను నిర్వహిస్తున్నామని, ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని పబ్‌ యజమానులు చెబుతున్నారు. మైనర్లకు మద్యం సరఫరా చేయడం కాని, నిర్దేశిత వేళలను అతిక్రమించి పబ్‌లను నడపవద్దని యజమానులు స్పష్టం చేశారు.