నిర్మాణంలో ఉన్న పోలీస్‌ అవాసాలపై మావోయిస్టుల దాడి

గిరిధిహ్‌: నిర్మాణంలో ఉన్న పోలీసు క్వార్టర్లపై మావోయిస్టులు విరుచుకుపడ్డారు. జార్ఖండ్‌లోని గిరిధిహ్‌ పట్టణ శివార్లలో ఈఘటన చోటుచేసుకుంది. సోమవారం వేకువ జామునే దాడి చేసిన మావోయిస్టులు పలు భవంతులను ధ్వంసం చేయడంతో పాటు ఇద్దరు కూలీలను పొట్టనబెట్టుకున్నారు. మావోయిస్టులు బాంబుపేల్చడంతో నిర్మాణంలో ఉన్న పోలీసు ఆవాసం భవంతి పైకప్పునకు భారీ కన్నం పడింది. ఇద్దరు కూలీలు పేలుడు పదార్ధాన్ని స్వాధీనం చేసుకుని నిర్వీర్యం చేశారు. రూ. 30కోట్లతో 72ఎకరాల విస్తీర్ణంలో చేపట్టిన ఈ పోలీసు నివాస సముదాయం పూర్తయితే తమకు మరిన్ని సవాళ్లు ఎదురవుతాయని మావోయిస్టులు ఆందోళన చెందుతున్నారు.
రాంచి: మావోయిస్టు గాలింపు చర్యల్లో భాగంగా చోటుచేసుకున్న ఎదురుకాల్పుల్లో ఇద్దరు సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు మృతి చెందగా, ఐదుగురు గాయపడ్డారు. జార్ఖండ్‌లోని కుంతి జిల్లా బాకప్‌ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రాంచీలోని ఆపోలో ఆసుపత్రికి తీసుకెళ్తుండగా ఇద్దరు సీఆర్పీఎఫ్‌ జవాన్లు మృతి చెందారు. మావోయిస్టులకు వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్‌లో కాల్పులు చోటుచేసుకోవడంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. అని డీజీపీ జి.ఎస్‌.రత్‌ విలేకరులకు తెలిపారు. గాలింపు చర్యలో పాల్గొంటున్న రెండు సీఆర్పీఎఫ్‌ బృందాల మధ్య పొరపాటున కాల్పులు చోటుచేసుకున్నట్లు వచ్చిన వార్తలపై ప్రశ్నించగా..క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి నిజాలను వెలికితీసేందుకు డిప్యూటీ బజీ షీతల్‌ ఒరాన్‌ను సంఘటనా స్థలానికి పంపినట్లు డీజీపీ వివరించారు.