నేడు ‘మనబియ్యం’ పథకం ప్రారంభం

సుభాష్‌నగర్‌, (జనంసాక్షి): తెల్ల కార్డుదారులకు నాణ్యమైన బియ్యం అందించేందుకు ఏర్పాటు చేసిన ‘మన బియ్యం’ పథకాన్ని బుధవారం హైదారాబాద్‌లో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి డి. శ్రీధర్‌బాబు ప్రారంభిస్తున్నారు. ఏ జిల్లాలో పండించిన బియ్యం అదే జిల్లాలోని తెల్లకార్డుదారులకు అందించాలనే అక్ష్యంతో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ బియ్యం సేకరణ చేపట్టింది. అందులో భాగంగా కరీంనగర్‌, వరంగల్‌, నల్గొండ జిల్లాలో ఇలా సేకరించిన బియ్యాన్ని కార్డుదారులకు పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. అందులో భాగంగా బుధవారం లలితా లళాతోరణంలో 9.30 గంటలకు జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమానికి జిల్లా పౌర సరఫరాల సంస్థ డీఎం చంద్రమోహన్‌ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా ఉదయం 5 గంటలకే తొమ్మిది బస్సులు తీసుకొని డీలర్లను, మిల్లర్లను, తెల్లకార్డుదారులను అక్కడికి పంపించే ఏర్పాట్లు చేశారు. ఆయా మండలాల నుంచి డీలర్లు, రైసు మిల్లర్లు, అధికారులు ప్రత్యేక వాహనాల్లో కార్యక్రమానికి హాజరవుతున్నట్లు వివరించారు. కార్యక్రమానికి జిల్లా సంయుక్త కలెక్టర్‌ అరుణ్‌కుమార్‌తో పాటు డీఎం చంద్రమోహన్‌, డీఎస్వో జి. శ్రీరాం హాజరు కానున్నారు.