నేడు సీబీఐ కోర్టుకు జగన్మోహన్‌రెడ్డి?

హైదరాబాద్‌:అక్రమాస్తుల కేసులో నిందితులుగా ఉన్న వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి, నిమ్మగడ్డ ప్రసాద్‌, మోపిదేవి వెంకటరమణ, బ్రహ్మానందరెడ్డిలను జైలు అధికారులు గగన్‌విహార్‌లోని సీబీఐ కోర్టుకు బుధవారం తీసుకొచ్చే అవకాశాలున్నాయి. వీరి రిమాండ్‌ గడువు బుధవారంతో ముగుస్తున్న నేపథ్యంలో రిమాండ్‌ పోడగింపు కోసం కోర్టులో హాజరుపరచనున్నట్లు సమాచారం. అదే విధంగా ఓఎంసీ కేసులో గాలి జనార్దన్‌రెడ్డి, బీవీ శ్రీనివాసరెడ్డి, రాజగోపాల్‌తో పాటు ఎమ్మార్‌ కేసులో నిందితుడిగా ఉన్న సునీల్‌రెడ్డి రిమాండే గడువు కూడా ముగియడంతో వీరిని కూడాఇదే రోజు కోర్టులో హాజరుపరచనున్నారు. సీబీఐ కోర్టు ప్రిన్సిపల్‌ జడ్జి సెలవులో చంచల్‌గూడ జైలుకు సీబీఐ కోర్టుకు మధ్య వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహణకు ఏర్పాట్లు లేనందువల్లే వీరందరినీ కోర్టులో వ్యక్తిగతంగా హాజరుపరుస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు బుధవారం ఉదయం 10 గంటలకు చంచల్‌గూడ జైలు నుంచి వీరిని తీసుకొచ్చేందుకు జైలు, పోలీసు అధికారులు తగిప బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.