పట్టాలెక్కనున్న కొత్త రైళ్లు

హైదరాబాద్‌ : రాష్ట్రంలో నాలుగు కొత్త ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. హైదరాబాద్‌ నుంచి పలు ప్రాంతాలకు నడిచే ఈరైళ్లను ఈనెల 6న స్థానిక ప్రజాప్రతినిధులు, రైల్వే ఉన్నతాధికారులు జెండా వూపి ప్రారంభించనున్నారు. హైదరాబాద్‌    – బెల్లంపల్లి మద్య రోజూ ఇంటర్‌ సిటీ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఈనెల 6 నుంచి ప్రారంభమవుతుంది. రోజూ ఉదయం 5.15 గంటలకు  హైదరాబాద్‌ నుండి బెల్లంపల్లికి.. 10.30 గంటలకు బెల్లంపల్లి నుండి రాజధానికి రైళ్లు బయలుదేరతాయి. ఈనెల 9 నుంచి సికింద్రాబాద్‌-విశాఖపట్నం మధ్య ట్రైవీక్లీ ఎసీ ‘దూరంతో’ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు రెగ్యులర్‌ సర్వీసులు ప్రారంభమవుతాయి. సోమ, బుధ, శనివారాల్లో రాత్రి 8.30 గంటలకు సికింద్రాబాద్‌-విశాఖ.. అలాగే ప్రతి మంగళ, గురు, ఆదివారాల్లో రాత్రి 10.35 గంటలకు విశాఖ-సికింద్రాబాద్‌ రైలు బయలుదేరుతుంది. ఈనెల 10 నుంచి సికింద్రాబాద్‌-దర్బంగ మద్య బైవీక్లీ ఎక్‌ప్రెస్‌ రైలు పరుగుపెట్టనుంది. మంగళ, శని వారాల్లో రాత్రి 10 గంటలకు సికింద్రాబాద్‌ నుంచి దర్బంగ.. అలాగరతే ఉదయం 7 గంటలకు దర్బంగ నుంచి సికింద్రాబాద్‌కు రైళ్లు నడుస్తాయి. హైదరాబాద్‌-అజ్మీర్‌ మద్య వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ రైలు కూడా ఈనెల 10న ప్రారంభమవుతుందని రైల్వే అధికారులు తెలిపారు. ప్రతి శనివారం మద్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌-అజ్మీర్‌, ప్రతి మంగళవారం సాయంత్రం 5.40 గంటలకు అజ్మీర్‌-హైదరాబాద్‌ రైళ్లు నడుస్తాయని అధికారులు వెల్లడించారు.