పరకాల విజయం తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి

నిజామాబాద్‌, జూన్‌ 15 : పరకాల ఉప ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ అభ్యర్థి భిక్షపతి విజయం సాధించడం తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి అని టిఆర్‌ఎస్‌ జిల్లా నాయకులు అన్నారు. శుక్రవారం ఉప ఎన్నికల ఫలితాల వెల్లడి అనంతరం జిల్లా టిఆర్‌ఎస్‌ కార్యాలయంలో విజయోత్సవాలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగారెడ్డి మాట్లాడుతూ తెలంగాణను అడ్డుకోవడానికి కాంగ్రెస్‌తో పాటు సమైక్య వాదులు ఎన్ని కుట్రలు చేసినా అంతిమ విజయం టిఆర్‌ఎస్‌దేనని ఆయన అన్నారు. తొందరలోనే తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేసి తెలంగాణను సాధించుకుంటామని అన్నారు. తెలంగాణ కావాలనే ఏకైక లక్ష్యంతో పరకాల ప్రజలు ఓటు వేశారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్‌ నాయకులు నారాయణగుప్త, సత్యప్రకాశ్‌, ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.