పర్యాటక ప్రాంతంగా పోచారంను అభివృద్ది చేయాలి
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని కోరిన ఎమ్మెల్యే సురేందర్
అంగీకరించిన మంత్రి కిషన్ రెడ్డి
నిజామాబాద్,ఆగస్ట్12(జనం సాక్షి): సహజ సిద్ధమైన పకృతి అందాలు కలిగిన పోచారం ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందేందుకు సహకరించాలనికేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డిని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే నల్లమడుగు సురేందర్ కోరారు. ఈ మేరకు ఇటీవల ఢీల్లీలో కేంద్రమంత్రిని కలిసి వినతిపత్రం అందించారు. ఈ ప్రాంత అబివృద్ధికి సహకరించాలని కోరారు. అందుకు స్పందించిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.టూరిజం సర్క్యూట్‌గా ఏడుపాయాల దేవాలయంతో కలిపి ఏర్పాటు చేస్తే పర్యాటకంగా మరింత అబివృద్ధి చెందు తుందని అంచనాలు వేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా రెండువందల కోట్ల రూపాయాలను వెచ్చిస్తే ఈ ప్రాంతం టూరిజంగా అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టు వద్ద పర్యాటక కేంద్రం సర్క్యూట్ ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. సహజసిద్ధంగా ప్రాజెక్టు ఉండడం, పక్కనే అడవి ఉండ డం, పకృతి సందర్శకులకు ఆకర్షించే విధంగా ఉండడంతో ముమ్మర ప్ర యత్నాలు జరుగుతున్నాయి. ప్రాజెక్టులో మధ్యన 25 ఎకరాలకు పైగా ఐలాండ్‌లో భూమి అందుబాటులో ఉండడంతో ఇక్కడ రిసార్ట్లు ఏర్పాటు చేస్తే పర్యటకంగా అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నారు. ప్రాజెక్టులో బోటింగ్‌తో పాటు ఇతర సదుపాయాలను ఏర్పాటు చేస్తే ఈ రెండు ఉమ్మ డి జిల్లాలతో పాటు హైదరాబాద్ నుంచి ఎక్కువ మంది వస్తారని జిల్లా అధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వం దృష్టికి స్థానిక ఎమ్మెల్యేతో తీసు కెళ్లారు. మంజీరాపై బ్రిడ్జి నిర్మాణం చేస్తే కలిసి వస్తోందని భావిస్తున్నారు. ప్రఖ్యాత పోచారం ప్రాజెక్టు వద్ద టూరిజం సర్క్యూట్ ఏర్పాటుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు సిద్ధం అవుతున్నారు. మెదక్ లోని ఏడుపాయాల దేవాలయాన్ని కలుపుతూ పర్యాటక కేంద్రంగా తీర్చి దిద్దేందుకు సిద్ధం అవుతున్నారు. దీనిలో భాగంగా మంజీరా నదిపై బ్రిడ్జి నిర్మాణం చేసి పోచారానికి నేరుగా చేరుకునే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. సుమారు రెండు వందల కోట్ల రూపాయల వరకు వెచ్చించి అభివృద్ధి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గుండారం, మంచిప్ప,
లింగంపేట వాగులను ఆధారంగా చేసుకుని పోచారం ప్రాజెక్టు నిర్మాణం చేశారు. పకృతి సిద్ధంగా ఆడవుల మధ్యన చేపట్టిన ఈ నిర్మాణం పర్యాటకులకు ఆకట్టుకునేలా రూపుదిద్దుకుంది. పదివేల ఎకరాలకు పైగా ఆయకట్టుకు సాగునీరు అందుతోంది. ప్రాజెక్టును చూసేందుకు ప్రతీ సంవత్సరం వేలాదిమంది పర్యాటకులు వస్తారు. మెదక్ ఏడు పాయాల దేవాలయానికి దగ్గరగా ఉండడంతో అక్కడికి హైదరాబాద్, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారు కూడా ప్రాజెక్టు వద్దకు వస్తారు. పక్కనే వన్యప్రాణి కేంద్రం ఉండడం వల్ల జంతువులను కూడా చూసే అవకాశం ఉండడంతో ఎక్కువ మంది వస్తారు. ఈ ప్రాజెక్టుకు వేసవిలో కూడా నీళ్లు ఉండడంతో ఎక్కువ మంది ప్రతీ సంవత్సరం వచ్చి వెళ్తుంటారు. దీంతో ఈ ప్రాంతాన్ని అభివృద్ది చేయాలని ఎమ్మెల్యే కోరారు.