పేద‌లు ఆత్మ‌గౌర‌వంతో బ‌త‌కాల‌నే డ‌బుల్ బెడ్రూం ఇండ్లు : మంత్రి త‌ల‌సాని

హైద‌రాబాద్ : పేదలు ఆత్మగౌరవంతో బ‌తకాలనే డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం చేప‌ట్టిన‌ట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని కమలా నగర్‌లో నిర్మించిన 210 డబుల్ బెడ్రూం ఇండ్లను బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌తో క‌లిసి మంత్రి తలసాని శ్రీనివాస్ యాద‌వ్ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ మాట్లాడుతూ.. లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మిస్తే కాంగ్రెస్, బీజేపీ నేతలకు కనిపిస్తలేవు అని మండిప‌డ్డారు. ఉచితంగా డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుంద‌న్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఇందిరమ్మ ఇండ్ల బ్యాంకు రుణాలను కూడా మాఫీ చేసి పేదలను ఆదుకున్న గొప్ప నేత కేసీఆర్ అని మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ గుర్తు చేశారు. 210 డబుల్ బెడ్రూం ఇండ్ల‌ నిర్మాణానికి మొత్తం రూ.16 కోట్ల 27 లక్షల 50 వేలు ఖర్చు చేయగా, రూ.15.50 లక్షల వ్యయంతో మౌలిక సదుపాయాలు కల్పించారు. ఈ కాలనీకి లక్ష లీటర్ల సామర్థ్యం కలిగిన వాటర్‌ ట్యాంక్‌, విద్యుత్‌ సౌకర్యంతో పాటు 15 దుకాణాలను ఏర్పాటు చేశారు. ఒక్కొక్కటి 560 ఎస్‌ఎఫ్‌టీ విస్తీర్ణంలో రూ.7.75 లక్షల వ్యయంతో నిర్మించారు. ఈ డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లకు డిగ్నిటీ కాలనీగా నామకరణం చేశారు.