పోలవరం డిజైన్‌ మార్చాల్సిందే.. పాల్వాయి గోవర్ధన్‌

హైదరాబాద్‌, ఆగస్టు 11 (జనంసాక్షి): పోలవరం ప్రాజెక్టు డిజైన్‌ మార్చాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్దన్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శనివారం నాడు ఆయన సిఎల్‌పి కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని అన్నారు. ప్రస్తుత డిజైన్‌తో తెలంగాణ ప్రాంతానికి తీరని అన్యాయం జరుగుతుందన్న ఆందోళన తమకు ఉందని, అందుకే డిజైన్‌ను మార్చాలని కోరుతున్నామని పాల్వాయి అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో తెలంగాణ ప్రాంతానికి అందాల్సిన 600 టిఎంసిల నీరు ఎలా విడుదల చేస్తారో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వివరించాలని డిమాండ్‌ చేశారు. ప్రాజెక్టుపై ప్రభుత్వానికి రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించే ధైర్యం ఉందా అని సవాల్‌ చేశారు. గోదావరి నీరు సముద్రంలోకి వృద్ధాగా పోవడం సరైంది కాదని అన్నారు. ఇంజనీర్లు, కాంట్రాక్టుర్లు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని తప్పుదోవ పట్టిస్తున్నారని పాల్వాయి ఆరోపించారు. తెలంగాణ ప్రజలకు సీమాంధ్ర నేతలు పన్నుతున్న కుట్రలు, కుతంత్రాలు తెలుసని, వారు అమాయకులేమీ కారని పాల్వాయి అన్నారు. ప్రాజెక్టుల విషయంలో జరుగుతున్న అంశాలపై సిబిఐ చేత విచారణ జరిపించాలని ఆయన డిమాండ్‌ చేశారు. అనంతరం కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ యాదవరెడ్డి మాట్లాడుతూ, గ్యాస్‌ కేటాయింపుల్లో కేంద్ర మంత్రి జయపాల్‌రెడ్డి బదలం చేసేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. జైపాల్‌రెడ్డిని చూసి సీమాంధ్ర నేతలు బయపడుతున్నారని ఆయన ఆరోపించారు. తమ పదవులు ఎక్కడ పోతాయోనన్న భయం సీమాంధ్ర నేతలను పట్టి పీడిస్తోందని, అందుకేే జైపాల్‌రెడ్డిపై విమర్శలు చేస్తున్నారని యాదవరెడ్డి అన్నారు.