ప్రమాదాలను తగ్గించేందుకు చర్యలు

ఆదిలాబాద్‌, జూలై 21 : జిల్లా కేంద్రంలో పని చేస్తున్న 45 మంది కానిస్టేబుళ్లకు హెడ్‌కానిస్టేబుళ్లుగా పదోన్నతి కల్పిస్తూ జిల్లా ఎస్పీ త్రిపాఠీ ఆదేశాలు జారీ చేశారు. గత నెల రోజుల క్రితం మెదక్‌ జిల్లాలో నెల రోజుల పాటు శిక్షణ పొంది పూర్తి ఉత్తీర్ణత సాధించిన 45 మంది కానిస్టేబుళ్లకు పదోన్నతి కల్పించారు. జిల్లాలో పెరుగుతున్న ప్రమాదాలను నివారించేందుకు, శాంతి భద్రతలను పరిరక్షించేందుకు, ప్రతి సాయంత్రం జిల్లావ్యాప్తంగా వాహనాల తనిఖీలను చేపట్టాలని ఎస్పీ పోలీసు అధికారులకు సూచించారు. జిల్లాలో నాలుగు లైన్ల రోడ్డు, ఆర్టీఎ విభాగం, సిగ్నల్స్‌ ఏర్పాటు, పోలీసుల కృషి వల్ల ఈ ఏడాది రోడ్డు ప్రమాదాలు తగ్గాయని ఆయన తెలిపారు. గత ఏడాది 113 రోడ్డు ప్రమాదాలు జరిగి 38 మంది చనిపోగా 134 మంది గాయపడ్డారని ఆయన తెలిపారు. ఈ ఏడాది 80 ప్రమాదాలు జరిగి 25 మంది చనిపోగా 109 మంది గాయపడ్డారని వివరించారు. రోడ్డు ప్రమాదాల నివారణ విషయమై అవగాహన సదస్సులు, చైతన్య కార్యక్రమాలు చేపట్టి ప్రజలు విస్తృతంగా ప్రచారం చేపట్టాలని ఎస్పీ ఆదేశించారు.