హైదరాబాద్ 14 మార్చి (జనంసాక్షి) :
తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. హైదరా బాద్- రంగారెడ్డి -మహబూబ్నగర్, నల్గొండ-వరంగల్-ఖమ్మం స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటలకు ముగిసింది. 4 గంటలలోపు క్యూలైన్లలో ఉన్నవారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తున్నారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ స్థానంలో మొత్తం 93 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించు కున్నారు. తెరాస తరఫున సురభి వాణీదేవి, భాజపా నుంచి రామచందర్ రావు, కాంగ్రెస్ తరఫున చిన్నారెడ్డితో పాటు స్వతంత్ర అభ్యర్థి ప్రొఫెసర్ నాగే శ్వర్ మధ్య గట్టి పోటీ నడిచింది. ఈ స్థానంలో సాయంత్రం 4 గంటల వరకు 59.96 శాతం పోలింగ్ నమోదైంది. మరోవైపు నల్గొండ-వరంగల్-ఖమ్మం స్థానంలో మొత్తం 71 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో తెరాస తరఫున పల్లా రాజేశ్వర్రెడ్డి, భాజపా నుంచి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి, కాంగ్రెస్ తరఫున రాములు నాయక్, యువతెలంగాణ పార్టీ నుంచి రాణి రుద్రమరెడ్డి తదితరులు పోటీ పడ్డారు. ఇక్కడ సాయంత్రం 4 గంటల వరకు 64.70 శాతం పోలింగ్ నమోదైంది.