ప్రారంభమైన ఐకెరెడ్డి పాదయాత్ర

ఆదిలాబాద్‌, అక్టోబర్‌ 30 : జిల్లాలోని తిరుగులేని నాయకుడిగా చక్రం తిప్పిన మాజీ ఎంపీ ఇంద్రకరణ్‌రెడ్డి తన రాజకీయ భవిష్యత్తును నిర్ణయించుకునేందుకు పాదయాత్ర చేపట్టారు. మూడు దశాబ్దాలుగా ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలిచి కాంగ్రెస్‌ పార్టీలో తిరుగులేని నాయకుడిగా చలామని అవుతున్న ఆయన ప్రభుత్వ వ్యతిరేక విధానాలు, తెలంగాణ అంశంపై జాప్యన్ని నిరసిస్తూ కాంగ్రెస్‌ పార్టీకి ఇటీవల రాజీనామా చేశారు. జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌గా, ప్రజా నాయకుడిగా ప్రజల్లో ఎంతో పేరు తెచ్చుకున్న ఇంద్రకరణ్‌రెడ్డి ఈ పాదయాత్ర తరువాత, తన భవిష్యత్తు కార్యచరణను ప్రకటించనున్నారు. నిర్మల్‌ పట్టణంతో పాటు నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో ఈ పాదయాత్ర చేపట్టనున్నారు. మొదటి విడతగా మంగళవారం నాడు నిర్మల్‌ పట్టణంలోని విశ్వనాథ్‌పేట కాలనీ నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా తాను పార్టీకి ఎందుకు రాజీనామా చేసాను అనే విషయాన్ని ప్రజలకు వివరించనున్నారు. ప్రజల సమస్యల కోసం నిరంతరంగా పోరాడుతానని, ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పనిచేస్తానని ఆయన ప్రకటించారు. ఈ పాదయాత్రలో ప్రజలను కలుసుకొని వారి సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి ఆయన కృషి చేయనున్నారు. ఈ పాదయాత్రలో తన అనుచరులను కలుసుకొని ప్రజల నిర్ణయానికి అనుగుణంగా తన రాజకీయ భవిష్యత్తును రూపొందించుకోనున్నారని ఆయన అనుచర వర్గం పేర్కొంది.