ఫీజులపై సుప్రీం తీర్పు నేపథ్యంలో ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష

హైదరాబాద్‌: రాష్ట్రంలో ఇంజినీరింగ్‌, ఇతర సాంకేతిక, ఉన్నత విద్యాకోర్సులకు సంబంధించి ఫీజుల నిర్ణయంలో ప్రభుత్వం ఆలోచనలో పడింది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ముఖ్యమంత్రితో ఉన్నతాధికారులు సమావేశమై దీనితో ముడిపడివున్న ఆంశాలన్నింటిని చర్చించారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూడా సీఎం వద్ద జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. వృత్తి విద్యాకళాశాలలో ఏకీకృత ఫీజు విధానం, బోధనా ఫీజుల చెల్లింపు వంటి ఆంశాలపై ముఖ్యమంత్రికి ఉన్నతాధికార్లు వివరణ ఇచ్చారు. రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.జి.గోపాల్‌, రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ జయప్రకాశ్‌, ఇతర ఉన్నతాధికార్లు సీఎంతో సమావేశమైన వారిలో ఉన్నారు. నిన్న సుప్రీంకోర్టు తీర్పు ముఖ్యాంశాలు, రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించాల్సిన ఆంశాలను ఇందులో చర్చించినట్లు సమాచారం. బోధనాఫీజుల చెల్లింపు విషయంలో ఇప్పటికే బడ్జెట్లో నాలుగువేల కోట్లను కేటాయించామని ఫీజుల పెంపుదల ఉంటే ఈ భారం ఏమేరకు ఉంటుందనే ఆంశంపైనా ఆర్థిక మంత్రితో చర్చించినట్లు తెలుస్తోంది. సుప్రీంకోర్టు తీర్పు పూర్తి పారం వచ్చిన తర్వాత మళ్లీ సమావేశమై నిర్ణయం తీసుకోనున్నారు.