బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో…..

*ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమైన వేడుకలు,
* ఊరూరా బతుకమ్మ సంబరాలు,

ఖానాపురం జనం సాక్షి

 

తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తున్న బతుకమ్మ వేడుకలు ఆదివారం మండల వ్యాప్తంగా అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఎంగిలిపూల బతుకమ్మ ను పేర్చి మహిళలు వేడుకలకు శ్రీకారం చుట్టారు. ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమై సద్దుల బతుకమ్మ వరకు మహిళలు ఉత్సాహంగా పండుగ జరుపుకుంటారు. ఉదయం పూట మహిళలు తోబుట్టువులు తీరొక్క పూలు తెచ్చి ఉపవాసంతో బతుకమ్మను పేర్చి గౌరమ్మను ప్రతిష్టించి పూజలు చేశారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టేలా గ్రామాల్లో పండుగ వాతావరణం ఏర్పడింది. మండలంలోని 20 గ్రామ పంచాయతీల పరిధిలో ఆయా గ్రామాల్లో ఊరూరా గుడి గోపురం లో గౌరమ్మ గౌరమ్మ ఉయ్యాలో అంటూ…. ఒక్కేసి పువ్వేసి చందమామ అంటూ…. బతుకమ్మ ఆటపాటలతో సందడి నెలకొంది తెలంగాణ ఆడపడుచులు అన్నదమ్ములు తెచ్చిన తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి ఊరంతా ఒకచోట చేరి కోలాటాలు పాటలు వాయనాల తో పూల పండగకు స్వాగతం పలికారు. మండలంలోని 20 గ్రామ పంచాయతీల పరిధిలోని గ్రామాల్లో సర్పంచులు లైటింగ్ తో పాటలు డీజే లు ఏర్పాటు చేశారు. పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.