బయట నుంచి గొళ్లెం పెట్టి గుడిసెకు నిప్పు

త్రుటిలో ప్రాణాలు దక్కించుకొన్న బాధితులు
జిన్నారం: బయట నుంచి గొళ్లెం పెట్టి గుడిసెకు నిప్పంటించిన దారుణ సంఘటన జిన్నారంలో సోమవారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. జిన్నారం శివారులోని గరీబ్‌సాబ్‌ దర్గా వద్ద మున్ని వెంకటమ్మ తమ గుడిసెలో ఇద్దరు పిల్లలతో కలిసి నిద్రపోతోంది. గుర్తు తెలియని వ్యక్తులు బయట నుంచి గొళ్లెం పెట్టి నిప్పంటించినట్లు తెలిపారు. మంటల సెగకు మేల్కొన్న వెంకటమ్మ ఆమె కుమారులు ప్రమీణ్‌, రాజులు తలుపులు లోపలి నుంచి విరగ్గొట్టి ప్రాణాలు దక్కించుకున్నారు. ఈ ప్రమాదంలో రూ.50 వేల వరకు నష్టం జరిగిందని బాధితులు పోలీసులకు ఫిర్యదు చేశారు. వీఆర్వో శ్రీనివాస్‌రావు సంఘటన స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. సంఘటనపై వెంకటమ్మ కొందరిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేసింది. గాఢనిద్రలో ఉంటే పరిస్థితి దయనీయంగా ఉండేదని స్థానికులు పేర్కొన్నారు.