బాధితులతో పునరావాస కేంద్రాల్లో కిటకిట

45మంది మృతి… 4లక్షలమంది శిబిరాలకు తరలింపు
కోక్రాఝర్‌, జూలై 27 : జాతుల వైరంతో అట్టడుకుతున్న అస్సాంలో బాధితుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. అల్లర్లు చెలరేగిన ప్రాంతాల్లో ఇప్పటి వరకు 45మంది మృతి చెందినట్లు నాలుగు లక్షల మందిని సహాయక శిబిరాలకు తరలించినట్లు ముఖ్యమంత్రి తరుణ్‌ గోగాయ్‌ శుక్రవారంనాడు వెల్లడించారు. ఆయన ఈ రోజు సహాయక శిబిరాలను సందర్శించి బాధితులను పరామర్శించారు. కోక్రాఝర్‌లోని కామర్స్‌ కాలేజీలో ఏర్పాటు చేసిన సహాయక శిబిరానికి ఎద్దులబండుల్లో, ట్రక్కుల్లో బాధితులు ఇళ్ళను వదిలిపెట్టి చేరుకుంటున్నారు. నాలుగు గదులున్నా డార్మెంటరీలో దాదాపు 5వేల మంది నివసిస్తున్నారు. వీరికి పప్పు, అన్నం అందిస్తున్నారు. తమ స్వగ్రామాలకు తిరిగి వెళ్ళేది లేదని బాధితులు కరాఖండిగా తెలియజేస్తున్నారు. కాలి బుడిదైన ఇళ్ళు మిగిలాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ క్షణాన తమపై దాడులు జరుగుతాయో అనే భయంతో బిక్కు బిక్కుమని గ్రామాల్లో గడపలేమని ఇక్కడ మాకు సురక్షితమైన ప్రదేశం అని వారు ముఖ్యమంత్రి ముందు వాపోయారు. ప్రభుత్వం సరైన భరోసా ఇవ్వలేకపోతుందనే వారు అంటున్నారు. ఇదిలా
వుండగా హింసను రెచ్చగొట్టే గ్రూపులపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బోడో, మైనారిటీ వర్గాల నేతలను హెచ్చరించాయి. ఘర్షణల కారణంగా నిలిచిపోయిన రైళ్ళ రాకపోకలు తిరిగి ఆరంభమైయ్యాయి. వివిధ ప్రాంతాల ప్రజలను గమ్యస్థానాలకు చేర్చేందుకు ఢిల్లీ, కోల్‌కతా, బెంగూళూరులకు ప్రత్యేక రైళ్ళను నడుపుతున్నారు. కాగా ఔరా నుంచి దిబ్రూగఢ్‌కు శుక్రవారం ప్రత్యేక రైలు నడిచింది. ఇదిలా వుండగా అస్సాంలో ఇంత తీవ్రస్థాయిలో హింస చేలరేగడానికి ఆ రాష్ట్రం భౌగోళికంగా రాజకీయంగా నెలకొన్న ఉనికే ప్రధాన కారణం. బంగాళాదేశ్‌, చైనా, మయన్మార్‌ లాంటి దేశాలకు అస్సాం సరిహద్దుగా ఉండటం వలన చొరబాటుదారులు సులువుగా ఈ రాష్ట్రంలోకి వస్తున్నారు. ఈ పరిస్థితిల్లో బంగ్లాదేశ్‌ నుండి వలసలను ఈశాన్య ప్రాంతంలో తీవ్రవాద హింసాకాండను అరికట్టేందుకు ప్రభుత్వము మరిన్ని చర్యలు తీసుకోవటం అత్యంత ఆవశ్యకం.