బాబు ఎన్ని వేషాలు వేసినా జనం నమ్మే స్థితిలో లేరు పీసీపీ అధ్యక్షుడు బొత్స

హైదరాబాద్‌, అక్టోబర్‌ 5 (జనంసాక్షి):

తొమ్మిది సంవత్సరాలు అధికారంలో ఉండి, ప్రజలకు ఏమీ చేయలేక, ప్రతిపక్షంలోకి రాగానే తిరిగి అధికారం చేపట్టేందుకు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేపట్టారని బొత్స అన్నారు. శుక్రవారం ఆయన గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ టిడిపి అధినేత చంద్రబాబు పాదయాత్ర చూస్తుంటే  తనకు జాలి వేస్తోందని అన్నారు. ఆయన పాలనలో విద్యుత్‌ దండగా అన్న చంద్రబాబు, తిరిగి తన పాదయాత్రలో ఉచిత విద్యుత్‌ను ఇస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. అన్ని వర్గాల ప్రజల్లో చంద్రబాబుపై విశ్వాసం పోయిందని ఆయన ఎన్ని జిమ్మిక్కులు చేసినా ప్రజలు నమ్మే స్థితిలో లేరని అన్నారు. చంద్రబాబు అవినీతి గురించి మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఆయన పాదయాత్రలు చేపడుతున్నారని విమర్శించారు. పార్టీ ప్రజల్లో ఎక్కడ ఉనికి తప్పిపోతుందోనన్న భావంతో తిరిగి తనపార్టీకి పూర్వపు వైభవం తెస్తామని ప్రగల్భాలు పలుకుతున్నాడని అన్నారు. దూరమైపోయిన అన్ని వర్గాలను తిరిగి దగ్గరకు చేసేందుకు బాబు డిక్లరేషన్‌లు ప్రకటిస్తున్నాడని ఎద్దేవా చేశారు. 2014లో టిడిపి కార్యాలయాన్ని కూడా మూసివేస్తాడని చంద్రబాబు డిక్లరేషన్‌ ఇస్తాడని బొత్స అన్నారు. ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినా అధికారంలోకి
బాబు ఎన్నివేషాలు..
రావడం కల్లా అని బొత్స అన్నారు. ఏ ఎన్నికలు జరిగినా తెలుగుదేశం మూడవ స్థానంలోనే ఉంటుందని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి టిడిపి వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలతో కుమ్మక్కు అవ్వాల్సిన పనిలేదని బొత్స స్పష్టం చేశారు. ప్రతిదానికి కాంగ్రెస్‌ పార్టీ కుట్ర చేస్తుందని చెప్పడం వైయస్సార్‌ సీపీ నేతలకు అలవాటు అయిపోయిందని విమర్శించారు. జగన్‌ను జైలుకు పంపాల్సిన అవసరం కాంగ్రెస్‌పార్టీకి లేదని అన్నారు. అన్నీ పరిశీలించాకే జగన్‌కు బెయిల్‌ రాలేదన్న విషయం ప్రజలకు స్పష్టమైందని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువని అదే పార్టీకి బలమని కూడా అన్నారు. తెలంగాణ ఎంపీలను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అరెస్టు చేయించారన్న వార్తల్లో నిజం లేదని బొత్స అన్నారు. ముఖ్యమంత్రిపై కొందరు నేతలు చేస్తున్న విమర్శలను తాను సమర్థించబోనని అన్నారు. సోనియా గాంధీకి కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు లేఖలు రాసే హక్కు ఉన్నదని అన్నారు. అయితే రాయని లేఖను రాసామని చెప్పడం పోరపాటని, కాంగ్రెస్‌ ఎమ్మెల్సీలేఖ వ్యవహారంపై  పరోక్షంగా  ఆయన స్పందించారు. అన్ని ప్రాంతాల ప్రజలకు, నేతలకు ఇష్టమయ్యే విధంగా కేంద్రప్రభుత్వం తెలంగాణపై నిర్ణయం తీసుకుంటుందని బొత్స అన్నారు.