బాలసాయి ట్రస్టుకు నోటీసులు జారీ
హైదరాబాద్: డీజీపీ కార్యాలయం ఎదుట దొరికిన వివాదాస్పద నగదు వ్యవహారంలో బాలసాయి ట్రస్టుకు ఆదాయపు పన్నుశాఖ నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు బాలసాయి ట్రస్టు తరపున ప్రతినిధి హాజరు కావాలంటూ ఆదేశించింది. బ్యాగుల్లో దొరికిన రూ. 6.75 కోట్ల నగదు ఎక్కడికి తీసుకెళ్తున్నారన్న దానిపై ట్రస్టు ప్రతినిధి రామరావును ఇప్పటికే ప్రశ్నించిన ఆదాయపు పన్ను అధికారులు ట్రస్టు కార్యకలాపాలకు సంబంధించిన ఖాతా పుస్తకాల్ని తీసుకురావాల్సిందిగా ఆదేశించారు. అటు విరాళాలకు సంబంధించిన అంశాలపైనా వివరాల్ని తేవాల్సిందిగా నోటీసుల్లో పేర్కొన్నారు. వారం రోజుల్లోగా నోటీసులకు స్పందించి వివరాలు ఇవ్వాలని అధికారులు బాలసాయి ట్రస్టుకు సూచించారు. వివాదాస్పద నగదుకు సంబంధించి రామారావును ఆదాయపు పన్నుశాఖ మరోమారు ప్రశ్నించనుంది.



