బీసీలపైనే టీడీపీ ఆశలు

చారిత్రక డిక్లరేషన్‌తో పట్టు సాధించే ప్రయత్నాలు
వచ్చే ఎన్నికల్లో బీసీ ఓట్లతోనే గెలవాలన్నది ప్రణాళిక
హైదరాబాద్‌, జూలై 10 : అధికారమే లక్ష్యంగా టీడీపీ అడుగులువేస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిణామాల్లో వైఎస్సార్‌ సీపీ పట్ల ప్రజల్లో పెరుగుతున్న ఆదరణకు అడ్డుకట్ట వేసేందుకు ఆ పార్టీ వ్యూహరచనతో ముందుకుపోతోంది. సమాజంలో 50 శాతానికి పైగా ఉన్న బీసీలను అక్కున చేర్చుకునేందుకు ఆ పార్టీ డిక్లరేషన్‌ ప్రకటించింది. సోమ, మంగళవారాల్లో ఎన్టీఆర్‌ భవన్‌లో నిర్వహించిన పార్టీ విస్తృత స్థాయి సమావేశాల్లో బీసీల సంక్షేమానికి పెద్దపీట వేసింది. బీసీల మద్దతు లేనిదే రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి రాలేమని భావించిన ఆ పార్టీ బీసీ సంక్షేమానికి పలు పథకాలను ప్రకటించింది. వచ్చే శాసనసభ ఎన్నికల్లో వంద సీట్లను బీసీలకే ఇవ్వాలని నిర్ణయించింది. అసెంబ్లీ ఎన్నికలతో పాటు అంతకు ముందు జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతం సీట్లను బీసీలకు ఇవ్వాలని నిర్ణయించింది. భవిష్యత్తులో అధికారంలోకి వస్తే 10వేల కోట్ల రూపాయలతో ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ మాదిరిగా బీసీలకు కేటాయించాలని, అలాగే రాష్ట్ర బడ్జెట్‌లో 25 శాతం నిధులను బీసీలకే ఖర్చు చేయాలని నిర్ణయించింది. జనాభా దామాషా ప్రకారం నిధుల కేటాయింపుపై కేంద్రంపై ఒత్తిడి తేవాలని, ఇందుకోసం జాతీయ స్థాయిలో ఉద్యమాలు సైతం నిర్వహించేందుకు టీడీపీ సమాయత్తమవుతోంది. కేంద్ర స్థాయిలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయడంతోపాటు బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు ఇచ్చేందుకు అవసరమైన చట్టాల కోసం ఉద్యమాలు నిర్వహించాలని టీడీపీ సంకల్పించింది. తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల చైర్మన్ల పదవులు మొదలుకుని, మార్కెట్‌ కమిటీ చైర్మన్ల వరకు, దేవాదాయ ట్రస్టు బోర్డులు, గ్రంథాలయ సంస్థలన్నింటీలో 50 శాతం బీసీలకు కేటాయించాలని నిర్ణయించింది. పార్టీలో కూడా బూత్‌కమిటీ కన్వీనర్‌ పదవి నుంచి పార్టీ విదాయక కమిటీ, పొలిట్‌ బ్యూరో వరకు 50 శాతం బీసీలకు కేటాయించాలనితెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు బీసీ డిక్లరేషన్‌ పేరిట ఒక విధాయక పత్రాన్ని కూడా విడుదల చేశారు. బీసీలే తమ బాస్‌లని ప్రకటించారు. 1983లో ఎన్టీఆర్‌ టీడీపీని ఆవిర్భవింపజేసిన సందర్భం నుంచి బీసీలే టీడీపీకి అండగా నిలిచారని, వారి మేలు మరవలేమని, వారి అభ్యున్నతి కోసం టీడీపీ ఎంతటి నిర్ణయాలకైనా వెనుకాడబోమని చంద్రబాబు ప్రకటించారు. ఇక నుంచి పార్టీ స్థాయిలో ఏ కార్యక్రమం నిర్వహించినా బీసీల ప్రాధాన్యత పెరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. పార్టీకి మోసం చేసినవారు అగ్రవర్ణాలవారేనని, బీసీలు ఎప్పుడూ టీడీపీని మోసం చేయలేదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో వైఎస్సార్‌ సీపీ ని ఎదుర్కొవాలంటే బీసీల మద్దతు క్రియాశీలకంగా ఉంటుందనే అభిప్రాయంతో చంద్రబాబు పావులు కదుపుతున్నారు. చంద్రబాబు ప్రకటించిన డిక్లరేషన్‌ ఏ మేరకు టీడీపీకి ఉపయోగపడుతుందో వేచిచూడాల్సిందే.