బొగ్గు కేటాయింపులపై బాధ్యత నాదే

సభా విశ్వాసానికి సై.. గత ప్రభుత్వ విధానాలే కొనసాగించాం
బొగ్గుస్కాంపై నోరు విప్పిన మౌనముని మన్మోహన్‌
న్యూఢిల్లీ, ఆగస్టు 27 (జనంసాక్షి):
బొగ్గు గనుల కేటాయింపుపై విపక్షాలను ముఖ్యంగా బిజెపిని ధీటుగా ఎదురుకోవాలని కాంగ్రెస్‌ నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వం గట్టిగా నిర్ణయించుకుంది. బిజెపి డిమాండ్‌ నేపథ్యంలో సోమవారం ప్రధాని పార్లమెంటులో వివరణ ఇచ్చిన సంతృప్తి చెందకపోవడం పట్ల ప్రభుత్వం విపక్షంతీరుపై గట్టిగా వ్యవహరించాలని నిర్ణయించుకుంది. సభలో విశ్వాసం కోరేందుకు కూడా వెనకాడకూడదని ప్రభుత్వం నిర్ణయించినట్లు అభిజ్ఞ వర్గాలు తెలిపాయి. వచ్చేవారం సభలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి తన బలాన్ని నిరూపించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. యుపిఎ అంతా ఐక్యంగా ఉందని దాని భాగస్వామ్య పక్షాలు కాంగ్రెస్‌కు మద్ధతు పలుకుతామని హామీ కూడా ఇచ్చాయి. కేటాయించిన బొగ్గు గనులను రద్దు చేసే ప్రసక్తే లేదు. అలాగే ప్రధాని రాజీనామా కూడా ప్రశ్నే లేదు. అవసరమైతే కాగ్‌ వ్యవహారంపై ప్రజాబద్దుల కమిటీలో సవాలు చేసేందుకైనా సిద్ధమేనని ఆ వర్గాలు తెలిపాయి. బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎలో చీలిక తెచ్చేందుకు కాంగ్రెస్‌లోని ఒక వర్గం ఇప్పటికే ప్రయత్నిస్తోంది. బొగ్గుకేటాయింపు వ్యవహారంలో బిజెపి వైఖరితో ఇప్పటికే జెడియు, శిరోమణి అకాలీదళ్‌ వంటి పార్టీలు విభేదీస్తున్నాయి. ప్రధాని రాజీనామా కన్నా సభలో దీనిపై చర్చ జరగాలని ఆ పార్టీలు భావిస్తున్నాయి.
బొగ్గు గనుల కేటాయింపులపై ఆ శాఖ నిర్ణయాలకు తనదే బాధ్యత అని ప్రధాని చెప్పినప్పటికి విపక్షాలు సంతృప్తి చెందకపోవడంతో ఆయన కాగ్‌ రిపోర్టు కొన్ని విషయాలను పరిగణలోకి తీసుకొని మొత్తం వ్యవహారాన్ని వివాదస్పదం చేసిందని వ్యాఖ్యానించారు. విపక్షాలు తనపై నిరాధార ఆరోపణలు చేయడం సరికాదని ఆయన అన్నారు. సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగించాలనే బిజెపి నిర్ణయించుకుందని అన్నారు. మన్మోహన్‌ సింగ్‌ ఈ సందర్భంగా ఒక హిందీ కవితను ఉటంకిస్తూ పలు సమాధానాలకంటే నా మౌనమే మేలు అని అన్నారు. పార్లమెంటులోనూ, ప్రజాబాహుళ్యంలోనూ విస్తృత చర్చ జరగాల్సిన సందర్భం అయితే పార్లమెంటులో చర్చకు బిజెపి సహకరించకపోవడం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నానని అన్నారు.