బోగస్ విద్యాసంస్థలను ఏరిపారేయండి
– కాగితాలతో కళాశాలలను నడుపుతారా?
– సమూల ప్రక్షాళనకు సీఎం కేసీఆర్ ఆదేశం
హైదరాబాద్,మే18(జనంసాక్షి): తెలంగాణలో విద్యావ్యవస్థను గాడిలో పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. పూర్తిస్థాయి ప్రక్షాళన దిశగా ప్రభుత్వం వేస్తున్న అడుగులు ఫలితాలనిస్తున్నాయని చెప్పారు. చిత్తశుద్ధితో తాము చేపట్టిన బృహత్కార్యానికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. నిబంధనలు అతిక్రమించిన కాలేజీల యాజమాన్యాలు వాటిని సరిదిద్దుకునేందుకు ప్రభుత్వం తగినంత సమయం ఇస్తుందని అన్నారు. విద్యాశాఖపై ముఖ్యమంత్రి అధికార నివాసంలో సీఎం కేసీఆర్ సవిూక్ష జరిపారు. డిగ్రీ కాలేజీల్లో ఆన్ లైన్ అడ్మిషన్లు, యూనివర్సిటీల్లో ఫ్యాకల్టీ, హాస్టళ్ల పరిస్థితి, ఇంజనీరింగ్-వృత్తివిద్యా కాలేజీల్లో చేపట్టిన తనిఖీలు.. తదితర అంశాలపై కూలంకషంగా చర్చించారు.
కాగితాలపై కాలేజీలు నడుపుతారా?
తెలంగాణలో గందరగోళంగా ఉన్న విద్యావ్యవస్థను చక్కదిద్దుతామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. అందుకే విద్యావ్యవస్థను పూర్తిస్థాయి ప్రక్షాళన చేస్తామని ఆయన చెప్పారు. బుధవారం రాత్రి సీఎం కేసీఆర్ విద్యాశాఖపై సవిూక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిబంధనలు అతిక్రమించిన కాలేజీ యాజమాన్యాలను సరిదిద్దుకునే అవకాశం, సమయం ఇస్తామని చెప్పారు.పుట్టగొడుగుల్లా పుట్టకొచ్చిన కాలేజీలు విద్యను వ్యాపారంగా మార్చాయని, కనీస సౌకర్యాలు కూడా విస్మరించాయని చెప్పారు. నాసిరకం కాలేజీలు స్వచ్ఛందంగా తప్పుకోవాలని కేసీఆర్ చెప్పారు. కాగితాల విూద కాలేజీలు నడవడం ఎంతటి దారుణం అని ఆవేదన వ్యక్తం చేశారు. కాలేజీ యాజమాన్యాల కకృతి చర్యలకు ఆన్ లైన్ అడ్మిషన్ విధానం అడ్డుకట్ట వేస్తుందని ఆశించారు. ఫేక్ కాలేజీ యాజమాన్యాలను కఠినంగా శిక్షిస్తామని తెలిపారు.
డిగ్రీ పొందినవాళ్లకు ఉద్యోగం లేదా ఉపాధి
డిగ్గీ పట్టా పొందినవాళ్లు ఖాళీగా ఉండకుండా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పొందేవిధంగా విద్యావ్యవస్థను తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు. మూస ధోరణులను వదిలి, మారుతున్న కాలానికి అనుగుణంగా అప్ టు డేట్ మార్క్ కనిపించేలా కోర్సులను ప్రవేశపెట్టాలని చెప్పారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో విద్యావిధానాన్ని పరిపుష్టం చేయాలంటే అనేక నూతన ఆవిష్కరణలకు నాంది పలకాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు కాలేజీ యాజమాన్యాలు, విద్యాశాఖ సమన్వయంతో కలిసి పని చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. గందరగోళంగా ఉన్న విద్యావ్యవస్థను చక్కదిద్ది, కేజీ టు పీజీ వరకు నాణ్యమైన విద్యను అందించాలన్నదే తమ ఉద్దేశమని ముఖ్యమంత్రి చెప్పారు. విద్యార్థి చదువుకు, మార్కెట్ కు, పరిశ్రమలకు అనుబంధంగా ఉండాలన్నారు. ఆ దిశగా జూనియర్, డిగ్రీ, పీజీ, వృత్తి విద్య కోర్సులను రూపొందించాలని ఆదేశించారు.
డొల్ల కాలేజీలకు చరమగీతం
పుట్టగొడుగుల్లా పుట్టుకువస్తున్న ఉన్నత విద్యాసంస్థల యాజమాన్యాలు విద్యను వ్యాపారంగా మార్చాయని సీఎం కేసీఆర్ విమర్శించారు. ఎఐసిటిఈతో గాని, రాష్ట్ర ప్రభుత్వంతో గాని సంబంధం లేకుండా కాలేజీలు నడుపుతుండటంపై ఆరా తీశారు. కనీస సౌకర్యాలు లేకుండా నాసిరకం విద్యను అందిస్తున్న విద్యాసంస్థలు స్వచ్ఛందంగా తప్పుకోవడం మేలని సూచించారు. జవాబుదారీతనం లోపించిన విద్యాసంస్థలకు రాష్ట్రంలో చరమగీతం పాడాల్సిందేనని స్పష్టం చేశారు. అసలే విద్యార్థులు లేకుండా నకిలీ ఫ్యాకల్టీని రికార్డుల్లో చూపెడుతూ కాలేజీలు నడపడం దారుణమన్నారు. అలాంటి విద్యాసంస్థల యాజమాన్యాలను గుర్తించి కఠినంగా శిక్షిస్తామని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. బాధ్యత గల ప్రభుత్వం అందిరికి న్యాయం జరగాలని చూస్తుందన్నారు. రిజర్వేషన్లు అమలు పరచకుండా తమ ఇష్టం వచ్చినట్టు అడ్మిషన్లు జరుపుకుంటామంటే ఎట్లా అని ప్రశ్నించారు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడ్డ విద్యార్థి కాలేజీల్లో చదువుకోవద్దా అని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం లేదా ఏదో ప్రభుత్వ రంగ సంస్థ నియంత్రణ లేకుండా నడిపించడం సరికాదన్నారు.
యూనివర్సిటీల్లో పరిస్థితి ఏంటి
తెలంగాణలో నడుస్తున్న యూనివర్సిటీలు, వాటిలో ఎన్నిటిలో వైస్ చాన్సలర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, వాటి అనుబంధ కాలేజీల్లో పరిస్థితులపై నివేదిక ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిని ఆదేశించారు. యూనివర్సిటీ భవనాల పరిస్థితి ఏంటి, ఫ్యాకల్టీ పరిస్థితి ఏంటి, విద్యార్థుల పరిస్థితి ఏంటి, హాస్టళ్ల నిర్వహణ వ్యవహారం ఏంటి, ఏఏ యూనివర్సిటీకి ప్రభుత్వం ఏ మేరకు సహకారం అందించాలి, ఎన్ని నిధులు అవసరం.. తదితర అంశాలపై పూర్తిస్థాయి సమాచారాన్ని తనకు ఇవ్వాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
డిగ్రీలో అడ్మిషన్లకు దోస్త్
డిగ్రీ అడ్మిషన్లు ఇకనుంచి ఆన్ లైన్లో చేపట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. దానికి అనుగుణంగా ఏర్పాట్లు పూర్తి చేసిన తర్వాత అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించాలని చెప్పారు. డిగ్రీ ఆన్ లైన్ సర్వీసెస్, తెలంగాణ (డీవోఎస్టి-దోస్త్) అంశంపై ఈ సవిూక్షలో ముఖ్యమంత్రి ప్రధానంగా చర్చించారు. ఆన్ లైన్ విధానం వల్ల విద్యార్థులకు లభించే సౌలభ్యాన్ని సవిూక్షించారు. విద్యార్థులు కాలేజీల చుట్టూ తిరిగి అడ్మిషన్ ఫీజులు చెల్లించే అనవసర ఖర్చు తప్పుతుందని, కావాల్సిన కాలేజీలో అడ్మిషన్ ను ఎంపిక చేసుకునే వెసులుబాటు కలుగుతుందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం కొన్ని కాలేజీల యాజమాన్యాల కక్కుర్తికి ఆన్ లైన్ విధానం అడ్డుకట్ట వేస్తుందని చెప్పారు. అనేక విధాలుగా విద్యార్థులకు ఇది శ్రేయస్కరమని వివరించారు. మెడికల్, ఇంజనీరింగ్ వంటి వృత్తి విద్యాకాలేజీల్లో అనుసరిస్తున్న ఆన్ లైన్ అడ్మిషన్ విధానాన్నే డిగ్రీ అడ్మిషన్లలోనూ అనుసరించనున్నారు.
త్వరలో ఫీజుల నిర్ణయం
గ్రావిూణ, జిల్లా స్థాయిల్లోని డిగ్రీ కాలేజీల్లో కనీస ఫీజులను రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. హైదరాబాద్ కేంద్రంగా ప్రతిష్టాత్మకంగా నడుస్తున్న డిగ్రీ కాలేజీల్లో ఫీజులపై ఆయా కాలేజీల యాజమాన్యాలతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నది. అటానమస్, మైనారిటీ, ప్రీమియర్ కాలేజీల యాజమాన్యాలతో చర్చించి పూర్తిగా సానుకూల వాతావరణంలో రాష్ట్రమంతా ఆన్ లైన్ విధానాన్ని అమలులోకి తెస్తుంది.
ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి (విద్యాశాఖ) కడియం శ్రీహరి, మిషన్ భగీరథ ఉపాధ్యక్షుడు వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రంజీవ్ ఆచార్య, కాలేజీయేట్ కమిషనర్ వాణిప్రసాద్, జెఎన్టీయు ఇన్ చార్జ్ వీసీ శైలజా రామయ్యర్ పాల్గొన్నారు.